ఉద్యోగ విరమణ వయస్సుకే.. బోధనకు కాదు..

by Aamani |
ఉద్యోగ విరమణ వయస్సుకే.. బోధనకు కాదు..
X

దిశ, జగదేవపూర్: దశాబ్దాల క్రితం బడి పంతులు అంటే బతుకు లేక బడి పంతులు అనేవారు.... రానురాను బతుకుదెరువు కోసం బడి పంతులు అనే స్థాయికి వచ్చింది...నాటి కాలంలో బడి పంతుళ్లు చాలీ చాలని వేతనాలతో జీవితాలను గడిపేవారు.నేడు బడి పంతులు అంటేనే లక్షల్లో జీతాలు అనే స్థాయికి చేరుకుంది. నేటి కాలంలో టీచర్లు సమయానికి బడికి వెళ్లుతున్నామా... పిల్లలకు విద్య బోధన చేస్తున్నామా...నెల గడిచే సరికి జీతాలు తీసుకుంటున్నమా...మా పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నమా అనుకునే వారు చాలా మంది ఉపాధ్యాయులే ఉంటారు. కానీ గత ఐదు దశాబ్దాల క్రితం చాలీచాలని జీతాలతో ఉపాధ్యాయ వృత్తిలో చేరి రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు.

విశ్రాంతి తీసుకుని మనమండ్లు, మనుమరాళ్లతో హాయిగా గడపవలసిన శేష జీవితాన్ని బడి పిల్లలతో గడుపుతూ నేటికీ సొంత గ్రామంలో విద్యార్థులకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరం నుండి సొంత ఖర్చులు భరించుకుంటూ వస్తూ గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు బోధన చేసి వారు ఉన్నత స్థాయిలో ఉంటే వారిని చూసి ఆనంద పడాలనే మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా బోధిస్తూ ఎంతో మంది మన్ననలు పొందుతున్నాడు... ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బాల్ రెడ్డి పంతులు పై ప్రత్యేక కథనం. ప్రస్తుతం ఆ మాస్టర్ వయసు ఎనిమిది దశాబ్దాలు. ఈ ఉపాధ్యాయుడు 1970 ఏటా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.మొదటి సారి ప్రభుత్వ ఉద్యోగం రాగానే ములుగు మండలం అచ్చాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో చేరాడు. అప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా పేద విద్యార్థులకు విద్యా బోధన చేసి 2004వ సంవత్సరంలో జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్ పాఠశాలలో పని చేస్తూ ఉద్యోగ పదవీ విరమణ పొందాడు.

నాటి నుండి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోకుండా విద్యార్థులకు ఎంతో కొంత సహాయం అందించాలనే ఉద్దేశంతో విద్యా బోధన చేస్తునే ఉన్నాడు. బాల్ రెడ్డి పంతులు గజ్వేల్ లో స్థిరపడిన తన సొంత గ్రామం జగదేవపూర్ మండలంలోని తిగుల్ లో నయా పైసా లాభం ఆశించకుండా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. తన స్వగ్రామం తిగుల్ కు రావడానికి రోజు 15 కిలో మీటర్లు ఆటోలో వచ్చి విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తారు. గడచిన దశాబ్ద కాలంగా స్వగ్రామం తిగుల్ లో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తున్నాడు.వయసుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతోనే గడుపుతున్నారు.

నేటి కాలంలో ఉద్యోగ విరమణ పొందిన తరువాత మనకేంటిలే మన పని మనం చేసుకుంటే పోతుందిగా అనుకునే వారే ఉంటారు. కానీ బాల్ రెడ్డి పంతులు మాత్రం గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద కుటుంబాల వారే విద్యను అభ్యసిస్తారని వారి కుటుంబాలకు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉంటుందని, వారికి ఇంటి వద్ద ట్యూషన్ చెప్పించలేని పరిస్థితి ఉంటుందని వారి పిల్లలు ఉన్నత చదువులు చదువలనేదే నా ప్రయత్నం అని రిటైర్డ్ మాస్టర్ బాల్ రెడ్డి వివరించారు. ప్రస్తుత సమాజంలో ఇంకా ఇలాంటి వారు కూడా ఉన్నారా అంటూ ఈ మాస్టర్ పై సమాజంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed