ఆస్తినంతా పిల్లులు, కుక్కల పేరుమీద రాసిన మహిళా.. తన సొంత పిల్లలకు మాత్రం ఇవ్వలే..

by Javid Pasha |
ఆస్తినంతా పిల్లులు, కుక్కల పేరుమీద రాసిన మహిళా.. తన సొంత పిల్లలకు మాత్రం ఇవ్వలే..
X

దిశ, ఫీచర్స్ : ఎవరైనా తమ సంపాదనంతా పిల్లలకే చెందాలని భావిస్తారు. కానీ చైనాలోని షాంఘైకు చెందిన లియూ అనే పేరుగల ఒక మహిళ (పెన్షనర్) మాత్రం తన 20 మిలియన్ యువాన్ల (₹232,729,560.00) సంపదను కేవలం తన పెంపుడు పిల్లులు, కుక్కలకోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. పైగా అవి తన సంతానం అయినటువంటి ముగ్గురు పిల్లల్లా కాకుండా చాలా ప్రత్యేకమని, తనకెప్పుడూ అండగా ఉంటాయని పేర్కొన్నది.

పిల్లలు పట్టించుకోలేదంటూ..

లియూ కొన్ని సంవత్సరాల క్రితం తన మొదటి వీలునామాను రాసినప్పుడు ఆస్తులన్నింటినీ తన ముగ్గురు పిల్లలకు చెందాలని అందులో ప్రస్తావించింది. కానీ ఇటీవల ఆమె తన నిర్ణయం మార్చుకుంది. తనకు ఆరోగ్యం బాగా లేప్పుడు సొంత పిల్లలే పట్టించుకోకపోవడం, బాగోగులు చూసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం, ఏ విషయంలోనూ సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం ఆమె మనసును తీవ్రంగా కలచివేసింది. దీంతో ‘నా పిల్లలు ఎన్నడూ నన్ను సక్రమంగా చూసుకోలేదు. కనీసం చూసుకునే ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి నా ఆస్తిని, ఎప్పుడూ పక్కనే ఉంటూ అండగా నిలిచిన పెంపుడు పిల్లులు, కుక్కలకు వదిలేస్తున్న’’ అని పేర్కొన్నది. అంతే కాకుండా తాను చనిపోయిన తర్వాత తన డబ్బు మొత్తం తన సొంత పిల్లలకు కాకుండా తన పెంపుడు జంతువులకోసమే ఖర్చు పెట్టాలని తాజా వీలునామాలో పేర్కొన్నది.

చట్టం ఒప్పుకోకపోయినా..

దురదృష్టవశాత్తూ లియూ తన ఆస్తిని పెంపుడు జంతువులకు ఇవ్వాలని పేర్కొనడాన్ని చైనీస్ చట్టం ఒప్పుకోలేదు. ఇక్కడి చట్టం ప్రకారం ప్రజలు తమ పెంపుడు జంతువులకు నేరుగా ఆస్తులను బదిలీ చేయలేరు. దీంతో లియూ ఒక లాయర్ ద్వారా తన పంతం నెగ్గించుకుంది. నేరుగా పెంపుడు జంతువుల పేరుమీద ఆస్తి బదిలీ చేయడం వీలుకాకపోవడంతో వాటికోసం ఒక వెటర్నరీ క్లినిక్‌ని ఏర్పాటు చేయించింది. అందులోని నిర్వాహకులు తన పెంపుడు పిల్లులు, కుక్కలను చేసుకునేందుకని తన ఆస్తిని బదిలీ చేసేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించింది.

వెటర్నరీ క్లినిక్‌ ద్వారా సంరక్షణ

బీజింగ్‌లోని చైనా విల్ రిజిస్ట్రేషన్ సెంటర్ హెడ్‌క్వార్టర్స్ అధికారి చెన్ కై సౌత్.. మీడియాతో మాట్లాడుతూ.. లియూ నిర్ణయంవల్ల ఆమె ఆస్తులు వృథా కాకుండా వెటర్నరీ క్లినిక్‌ను పర్యవేక్షించడానికి ఆమె విశ్వసించే వ్యక్తిని నియమించాలని ఆమెకు సూచించామని పేర్కొన్నారు. దీంతో ఆస్తి ఆమె సంతానానికి కాకుండా పెంపుడు జంతువులకే పరోక్షంగా ఖర్చుచేసే అవకాశాన్ని కల్పించింది. అయితే కొందరు లియు తన పిల్లలను కాకుండా పెంపుడు జంతువులను మాత్రమే వారసులుగా మార్చడంపట్ల నిర్ణయం మార్చుకోవచ్చుననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ లియూ మాత్రం తన సంతానానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వనని కరాఖండిగా చెప్పేస్తోంది. అయితే ఈ మహిళ నిర్ణయం చైనాలోని మిలియన్ల మంది హృదయాలను తాకింది. వారిలో ఎక్కువ మంది ఆమె పరిస్థితికి సానుభూతి చూపుతున్నారు. ఒక వ్యక్తి అయితే “మంచి పనిచేశారు. భవిష్యత్తులో నా కుమార్తె కూడా నన్ను సరిగ్గా చూసుకోకపోతే నేను కూడా నా ఇంటిని ఇతరులకు వదిలివేస్తాను’’ చైనా X(ట్విట్టర్) వెర్షన్ సినా వీబోలో కామెంట్ చేశాడు.

Advertisement

Next Story