Nails Changes Reasons : చేతి గోర్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? బీ కేర్ ఫుల్!

by Javid Pasha |
Nails Changes Reasons : చేతి గోర్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? బీ కేర్ ఫుల్!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఓ అంచనాకు వస్తుంటారు చాలా మంది. అలాగే చేతి గోర్లలో వచ్చే మార్పులు కూడా పలు అనారోగ్య సంకేతాలను వెల్లడిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వాటిని ముందుగానే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని అంటున్నారు. అయితే గోర్లలో ఏయే మార్పులు దేనికి సంకేతం? ఎలాంటి అనారోగ్యాలు ఉన్నప్పుడు ఎటువంటి చేంజెస్ కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.

*పసుపు రంగులోకి మారడం : నిజానికి గోర్లు తెల్లగా ఉంటాయి. అయితే కొందరిలో క్రమంగా అవి పసుపు రంగులోకి మారుతుంటాయి. చాలా మంది దీనిని ముందుగా గుర్తించరు. ఎవరైనా చెప్తేనో, సమస్య పెరిగాకనో చూస్తుంటారు. అయితే ఇలా గోర్లు ఎల్లో కలర్‌లోకి మారడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా స్మోకింగ్ చేసేవారిలో ఇలా మారే అవకాశం ఉంది. అలాగే థైరాయిడ్, శ్వాసకోశ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా గోర్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. కాబట్టి వారానికి మించి మీ గోర్ల రంగు పసుపుగానే కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* తరచుగా విరిగిపోవడం : గోర్లు సన్నగా ఉన్నా వాటిస్థాయిలో అవి స్ట్రాంగ్‌గానే ఉంటాయి. తరచుగా పెరుగుతుంటాయి. కట్ చేస్తే తప్ప విరిగిపోవు. కానీ కొన్నిసార్లు కట్ చేయకపోయినా టవల్, బెడ్‌షిట్ వంటివి తగిలినా విరిగిపోతుంటాయి. ఇలా జరుగుతోందంటే.. అనుమానించాల్సిందే. ఎందుకంటే.. మీ శరీరంలో విటిమిన్ బి, కాల్షియం, ఐరన్, హెల్తీ ఫ్యాట్స్ లోపం ఉంటే కూడా ఇలా జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

* హాఫ్ మూన్ నెయిల్స్ : కొన్నిసార్లు గోర్లు కట్ చేయకపోయినా అవి హాఫ్ మూన్ ఆకారంలో కట్ చేసిన మాదిరి మారుతుంటాయి. వీటినే ఆరోగ్య నిపుణులు వైద్య పరిభాషలో టెర్రీస్ నెయిల్స్ అంటారు. అయితే కాలేయం, మూత్ర పిండాల్లో సమస్యలు ప్రారంభమైన వారిలో కూడా ఈ సంకేతాలు కనిపిస్తాయి. కాబట్టి మీ గోర్లలో మార్పులను గమనిస్తే ఎంతకైనా మంచిది ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

*స్పూన్‌ షేప్ నెయిల్స్ : మరికొందరిలో గోర్లు సాధారణ ఆకారాన్ని కోల్పోయి స్పూన్ మాదిరి పెరుగుతుంటాయి. అయితే శరీరంలో రక్తహీనత, లివర్ ఇష్యూస్, హైపోథైరాయిడిజం, ఐరన్ లోపం వంటివి ఉన్నప్పుడు ఇలాంటి మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీ ఆహారంలో, జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* తెల్లటి మచ్చలు : కొన్నిసార్లు గోర్లలో తెల్లటి మచ్చలు వంటివి కనిపిస్తే చాలా సింపుల్‌గా తీసుకుంటారు. అలా ఎందుకు జరుగుతుందో తెలియకపోవడంవల్ల పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ పరిస్థితిని ల్యుకోనిచియా అంటారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బాడీలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ప్రారంభమైనప్పుడు లేదా జింక్ లోపం ఉన్నప్పుడు, అలెర్జీలు వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి గుర్తించగానే జాగ్రత్త పడాలి, వైద్య నిపుణులను సంప్రదించి తగిన సూచనలు పాటించాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed