Fish Rain: అక్కడ చేపల వర్షం కురుస్తుందని మీకు తెలుసా!

by Prasanna |
Fish Rain: అక్కడ చేపల వర్షం కురుస్తుందని మీకు తెలుసా!
X

దిశ, ఫీచర్స్ : వడగళ్లవాన కురుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే కానీ చేపల వర్షం కురుస్తుందని మీరెప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని లాజమను(Lajamanu) పట్టణ ప్రజలు. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడైతే జరిగింది. కావాలంటే మా దగ్గర వాటికి సంబంధించిన ఆధారాలున్నాయి’ అంటూ చేపల వర్షం కురిసినప్పటి ఫొటోలు చూపిస్తారు ఇక్కడి స్థానికులు.

50 ఏండ్లలో నాలుగుసార్లు

తనమీ ఎడారి సమీపంలోగల ఆస్ట్రేలియన్ అవుట్‌బ్యాక్‌లోని లాజమను పట్టణంలో గత 50 ఏండ్ల కాలంలో నాలుగుసార్లు చేపటల వర్షం కురిసిందట. ‘‘వర్షం వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఉరుములు, మెరుపులు మనం చూస్తుంటాం. అయితే మెరుపు ఒకేసారి ఒకేచోట పడుతుంది. కానీ ఒకేసారి రెండుచోట్ల పడదు కదా.. అట్లనే చేపల వర్షం అంతటా పడాలని లేదుగా, అంతటా పడకపోయినా మా లాజమాలో మాత్రం పడుతుంది’’ అని అక్కడివారు కరాఖండిగా చెప్తుంటారు. అయితే చేపల వర్షం ఎప్పుడు కురుస్తుందో, ఎన్నాళ్లకు కురుస్తుందో మాత్రం గ్యారంటీగా చెప్పలేం. కురిసినప్పుడు మాత్రమే ఆ దృశ్యాన్ని ఆస్వాదించాలని అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు.

నార్తర్న్ టెరిటరీ అవుట్‌బ్యాక్‌లోని నిర్జల పట్టణ ప్రాంతమైన లాజమనులో సహజంగానే చాలా తక్కువ వర్షంపాతం నమోదువుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గత అర శతాబ్దంలో నాలుగుసార్లు ‘చేపల వర్షం’ కురిసింది. 1974లో ఒకసారి, 2004లో మరోసారి, 2010లో ఇంకోసారి, ఈ ఏడాది గత ఆదివారం మరోసారి చేపల వర్షం కురిసింది. లాజమను పట్టణానికి కొద్ది మైళ్లదూరంలో చేపలు కలిగిన చిన్నపాటి కుంటలు కూడా ఉంటాయి. కానీ గత ఆదివారం తుఫాను సమయంలో వర్షంతోపాటు ఆకాశం నుంచి చేపటలు పడటం ప్రారంభించాయని స్థానికులు చెప్తున్నారు. ‘మీరు చెప్తున్నది నమ్మలేం’ అని ఎవరైనా అంటే ఇదిగో సాక్ష్యం అంటూ అక్కడి ప్రజలు చేపల వర్షం కురుస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోలను చూపుతున్నారు.

‘‘ఇక్కడ పెద్ద తుఫాను వచ్చింది. వర్షం కురుస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే వర్షంతోపాటు ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయి. నేను కళ్లారా చూశాను’’ అని లాజమాను స్థానికుడు, సెంట్రల్ ఎడారి కౌన్సిలర్ ఆండ్రూ జాన్సన్ జపానాంగ్ పేర్కొన్నాడు. ‘‘కొందరు వర్షం పడుతున్నప్పుడు నేలమీద చేపలు పడటాన్ని చూశారు. మరి కొందరు తమ ఇండ్ల పైకప్పుపై పడుతుంటే చూశారు. ఇది దేవుడి ఆశీర్వాదమని మేం’’ భావిస్తున్నాం అని మరో వ్యక్తి చెప్పాడు. అయితే ఇక్కడి ప్రజలు చెప్తున్నట్టు ఇటువంటి అసాధారణమైన అద్భుతాల గురించి మనం తరచూ వింటుంటామని చేపల క్యూరేటర్ మైఖేల్ హామర్ అంటున్నారు.

ఆధారాలున్నాయా?

‘‘లాజమాను ప్రజలు వర్షం పడిన తర్వాత చాలాసార్లు బయటకు వచ్చి ప్రతిచోటా చేపలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని, అవి వర్షంవల్లే పడ్డాయని చెప్తుంటారు. కానీ వారు నిజానికి ఆకాశం నుంచి పడుతున్నప్పుడు వాటిని చూడరు. ఈ విషయంలో సైంటిఫిక్ ఎవిడెన్స్ కంటే కూడా లాజమాను ప్రజలు మేఘాల నుంచి వర్షం కురిసిందని, చేపలు కూడా పడ్డాయని నమ్మడానికే ఇష్టపడుతుంటారు. చేపలు వర్షం పడుతున్నప్పుడు వరదలు పారుతున్నప్పుడు బయటకు వస్తుంటాయి’’ అని మైఖేల్ హామర్ స్పష్టం చేశాడు.

నమ్మకానికి కారణం ఇదే

అయితే లాజమను ప్రజలు చేపల వర్షం కురిసిందని నమ్మడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మారుమూల పట్టణానికి సమీపంలో నీటి గుంటలు లేవు. తరచూ వర్షాలు ఉండవు కాబట్టి ఇక్కడ చేపల వ్యాపారాలు కూడా ఉండవు. అరుదుగా నిలువ ఉండే నీటి గుంటల్లోని చేపలు మాత్రమే ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు అవి వరదకు ఎదురీది బయటకు వస్తుంటాయి. ఈ విషయంలో ఇక్కడి ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి అలా నమ్ముతుంటారని పరిశీలకు చెప్తున్నారు. సాధారణంగా చేపల వర్షం కురువదు, వర్షం పడ్డప్పుడు చేపలు కనబడటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆస్ట్రేలియాలోని లాజమాను పట్టణ ప్రజలు చాలామంది దీనిని అంగీకరించరు. మరిన్ని వాస్తవాలు తెలుసుకోవాలంటే మాత్రం ఆస్ట్రేలియన్ అవుట్ బ్యాక్ ప్రాంతాలను సందర్శించాల్సిందే అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed