Alcohol : ఇక మద్యం ఎంతైనా తాగొచ్చేమో!.. కిక్ ఎక్కకుండా జెల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు

by Javid Pasha |
Alcohol : ఇక మద్యం ఎంతైనా తాగొచ్చేమో!.. కిక్ ఎక్కకుండా జెల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : మద్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి తాగకూడదనే విషయం తెలిసిందే. అలాగే ఇది మత్తు పదార్థం కూడా కావడంవల్ల డ్రింక్ చేసిన వారు ఆ సమయంలో ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఇంట్లో ఉన్నప్పుడు కిక్కులో ఉంటే ఎవరికీ సమస్య ఉండదేమో కానీ.. కొందరు బయటకు వెళ్లడం, ఏకంగా బైకులు, కార్లు నడుపుతూ పట్టుబడటం, ప్రమాదాలకు కారణం అవడం వంటి సంఘటనలు రోజూ ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మందుబాబులకు ఓ గుడ్ న్యూస్. ఇక నుంచి మీరు ఎంత తాగినా ఎక్కిన కిక్ వెంటనే తగ్గించగల ఓ చక్కటి పరిష్కారాన్ని క్రియేట్ చేశారు స్విడ్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు.

తాము తయారు చేసిన ప్రోటీన్ జెల్ ద్వారా మద్యం మత్తును, దాని కారణంగా శరీరంపై పడే చెడు ప్రభావాలను తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందకంటే ఈ జెల్ బాడీలోకి ప్రవేశించిన మద్యాన్ని ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్‌గా మారకుండా నివారిస్తుందట. అంటే మత్తు ఎక్కకుండా చేయడంతోపాటు ఆరోగ్యంపై ప్రభావం చూపని ఎసిటిక్ యాసిడ్‌గా ఈ కొత్త జెల్ పనిచేస్తుంది.

నిజానికి మనం తినే ఆహారం స్లోగా జీర్ణం అవుతుంది. కానీ మద్యం మాత్రం జీర్ణవాహిక గోడలపై ఉండే మ్యూకస్-మెంబ్రేన్‌ పొరల గుండా రక్తంలోకి ప్రవేశించి, రక్త కణాల ద్వారా శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే మద్యం తీసుకున్న కొద్దిసేపటికే కిక్ ఎక్కుతుంది. అయితే రక్తంలోకి చేరిన ఆల్కహాల్‌ను మన లివర్ బ్రేక్‌డౌన్‌ చేసి ఎసిటాల్డిహైడ్‌గా మార్చుతుంది. ఆ తర్వాత కొద్ది సేపటికి అది ఎటువంటి ప్రమాదం కలిగించని ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది.

అయితే ఈ ప్రాసెస్ జరిగే లోపలే మద్యం మానవ శరీరానికి హాని చేస్తుంది. కాగా ప్రస్తుతం శాస్త్రవేత్తలు క్రియేట్ చేసిన జెల్ ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశించి, ఆ తర్వాత ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్‌గా మారకుండా నేరుగా ఎసిటిక్ యాసిడ్‌గా మారేలా చేస్తుంది. దీంతో ఈ జెల్‌ను నోటి ద్వారా తీసుకోవడంవల్ల ఎక్కిన కిక్ వెంటనే దిగడంతోపాటు మద్యంవల్ల కలిగే హానిని నివారిస్తుంది. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవట. ప్రస్తుతం ఎలుకలపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అవడంతో, ఆ జెల్‌ను మనుషులపై కూడా ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా విజయవంతమైతే మద్యం మత్తులో ఏటా సంభవించే 30 లక్షల మరణాలను అరికట్టే అవకాశం ఏర్పడినట్టే.

Advertisement

Next Story