Parle-G | పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్‌పై పాప ఎవరో స్వయంగా వెల్లడించిన కంపెనీ మేనేజర్!

by Anjali |   ( Updated:2023-08-03 12:05:12.0  )
Parle-G | పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్‌పై పాప ఎవరో స్వయంగా వెల్లడించిన కంపెనీ మేనేజర్!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లే-జీ బిస్కెట్స్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ బిస్కెట్ భారతీయులకు కేవలం ఒక ఆహార పదార్థమే కాదు చిన్ననాటి జ్ఞాపకాలు కూడా. ఈ బిస్కెట్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అలాగే ఈ బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఫేమసో దానిపై ఉండే ఓ క్యూట్ బుజ్జాయి కూడా అంతే ఫేమస్. అయితే ఈ పాప ఎవరని చాలా మంది జనాల్లో సందేహం వచ్చే ఉంటుంది కదా? అప్పట్లో ఈ పాప ఎవరనేది రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్మన్ సుధామూర్తి అనే ప్రచారం కూడా చాలా రోజులు కొనసాగింది. అయితే ఈ పార్లే బేబీ ఎవరని పార్లే గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మాయాంక్ష తాజాగా వెల్లడించారు. అసలు ఈ బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న పాప నిజమైన మనిషి కాదని ఆయన బయటపెట్టారు. ఎవరెస్ట్ క్రియేటివ్ అనే సంస్థకు చెందిన మగన్‌లాల్ దాహి అనే ఆర్టిస్ట్ 1960లలో ఈ ఊహాత్మక పాప చిత్రాన్ని గీశాడని తెలిపారు. ఈ ఫొటోనే అప్పటి నుంచి పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్రిస్తున్నారని అన్నారు.

ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. పార్లే కంపెనీ వెనక కూడా ఓ ఇంట్రెస్టింగ్ విషయం దాగి ఉంది. స్వాతంత్రానికి ముందు స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జరిగిన ఉద్యమ స్ఫూర్తితో ఈ కంపెనీ పుట్టిందట. ముంబయిలో వీలే పార్లే అనే ప్రాంతలో మోహన్ లాల్ దయాల్ అనే వ్యక్తి ఈ కంపెనీని స్థాపించాడు. ఇందుకోసం ఆయన జర్మనీ వెళ్లి బిస్కెట్ల తయారీని నేర్చుకున్నాడట. అప్పటి నుంచి రూ.60వేలు పెట్టి మిషన్లు కొనుక్కొచ్చి మన దేశంలో కంపెనీ ప్రారంభించారు. అయితే ఆయన కంపెనీకి పేరు మాత్రం పెట్టలేదు. ఈ కంపెనీ వీలే పార్లే ప్రాంతంలో ఉన్నందున దీన్ని పార్లే అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అప్పటినుంచి పార్లే అనే పేరు ఈ కంపెనీకి స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చర్చానీయాంశంగా మారింది.

Advertisement

Next Story