క్షణాల్లో ప్రాణం తీసే న్యూమోథొరాక్స్.. ఊపిరి తిత్తుల్లో ఏం జరుగుతుందంటే..

by Hamsa |   ( Updated:2023-07-25 06:44:37.0  )
క్షణాల్లో ప్రాణం తీసే న్యూమోథొరాక్స్.. ఊపిరి తిత్తుల్లో ఏం జరుగుతుందంటే..
X

దిశ, ఫీచర్స్: అది చైనాలోని షెన్‌జెన్‌ సిటీ.. తన అభిమాన ఐడల్ గ్రూప్ నిర్వహించిన సంగీత కచేరికి హాజరైన ఓ 19 ఏళ్ల యువకుడు ఉల్లాసంగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో సంతోషంతో చప్పట్లు చరుస్తూ.. కేకలు వేస్తున్నాడు. అలా కొద్దిసేపు గడిచాక అతని అరుపులు ఎక్కువయ్యాయి. చూస్తున్నవారంతా కేకలు వేస్తూ, గుండెలు బాదుకుంటూ మరింత ఆనందంగా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడని అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదు. సడెన్‌గా అతనికి ఛాతీలో నొప్పి వచ్చింది. అంతసేపూ సంతోషంగా అరిచిన అతను.. నొప్పి స్టార్ట్ అవ్వగానే బాధతో అరుస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. కారణం.. అక్కడున్నవారందరూ అతను ఎంజాయ్ చేస్తున్నాడని అనుకున్నారు.

ఈవెంట్ ముగిసింది. అందరూ బయటకు వెళ్తున్నారు. కానీ ఉల్లాసంగా కేకలు వేసిన యువకుడు మాత్రం కిందపడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అందరూ వెళ్లాక చివరలో అక్కడ మిగిలిన ఒకరిద్దరు వ్యక్తులు అతన్ని గమనించి, హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అతని ఊపిరితిత్తుల్లోని అల్వియోలార్ చీలిపోయిందని, న్యూమోథొరాక్స్ బారిన పడ్డాటం కారణంగా ఇలా జరిగిందని, అందుకే కుప్పకూలిపోయాడని నిర్ధారించారు. ఇటీవల ఏ ఆరోగ్య సమస్య లేనివారు కూడా సడెన్‌గా కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు వదులుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఇవి అరుదుగానే జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులు సమస్య విస్తరిస్తుందేమోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఎందుకంటే న్యూమోథొరాక్స్(pneumothorax) వ్యాధి అనుకోకుండా ప్రాణహాని కలిగిస్తుంది. బాధిత వ్యక్తుల్లో దాని లక్షణాలు ముందుగా కనిపించవు. అనుకోకుండా ఊపిరితిత్తులు, ఛాతీ గోడల మధ్య కుహరంలో గాలి పీడనం అధికమై లంగ్స్‌‌‌కు చిల్లులు పడతాయి. ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైతే ఊపిరితిత్తులు పగిలిపోయి మరణం సంభవించవచ్చు. అందుకే సడెన్‌గా తీవ్రమైన ఛాతీనొప్పిని అనుభవిస్తుంటే, రెండు మూడు నిమిషాల వరకూ అలాగే కొనసాగుతూ అధికం అవుతుంటే.. నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed