'ధరణి'కి చట్టబద్ధత..!

by Shyam |   ( Updated:2020-09-22 20:32:37.0  )
ధరణికి చట్టబద్ధత..!
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కొత్త రెవెన్యూ విధానం అమలులోకి వచ్చింది. ‘భూమి హక్కులు-పట్టాదారు పుస్తకాల చట్టం, వీఆర్వో పోస్టుల రద్దు చట్టం’ ఈ రెండింటికీ గవర్నర్ తమిళిసై మంగళవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ‘ధరణి’ పోర్టల్‎కు చట్టబద్ధత ఏర్పడింది. నేటి నుంచి సరికొత్త పాలనను ప్రజలు చూడబోతున్నారు. రెవెన్యూ నిపుణులు మాత్రం కొత్త యాక్టుల మీద పెదవి విరుస్తున్నారు. వీటి ద్వారా సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందని స్పష్టం చేస్తున్నారు. అత్యద్భుతంగా ప్రభుత్వం పేర్కొన్న ఈ చట్టాలతో ఏ మేరకు మేలైన పౌర సేవలు అందుతాయో కాలమే నిర్ణయిస్తుంది.

కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ భూములను తహశీల్దార్, వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ఆటోమెటిక్ మ్యుూటేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ధరణి పోర్టల్లో వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరుగా నమోదు ప్రక్రియను రూపొందిస్తున్నారు. గ్రీన్, మెరూన్ కలర్ పాస్ పుస్తకాలను జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. పౌతి, కోర్టు డిక్రీలను, భాగ పంపకాలను కూడా తహశీల్దార్ కార్యాలయంలోనే పూర్తి చేయనున్నారు. ఏ ప్రక్రియకైనా ముందుగానే వెబ్ సైట్ ద్వారా సమయాన్ని బుక్ చేసుకోవడం అనివార్యం. బ్యాంకు రుణాలకు కూడా ‘ధరణి’ ప్రాతిపదిక సరిపోతుందని ప్రకటించారు. ఇప్పటి నుంచి తహశీల్దార్ జాయింట్ రిజిస్ట్రార్‎గానూ కొత్త బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు.

కొత్త చట్టాల అమలులో ‘ధరణి’ పోర్టల్ రెవెన్యూ గ్రంథంగా మారింది. ఏ చిన్న సమస్య తలెత్తినా, అన్యాయం జరిగిందని భావించినా ఇక నుంచి సివిల్ కోర్టులకే వెళ్లాలని చట్టం చెబుతోంది. కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఆర్డీవో దగ్గర అప్పీలు, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉండదు. న్యాయవాదిని పెట్టుకొని కోర్టును ఆశ్రయించాల్సిందే. తప్పు ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా భరించాల్సింది మాత్రం హక్కుదారుడే. వాటిని సరిదిద్దుకునేందుకు అతనే ప్రయత్నించాలి. అలాగే కోర్టు కేసుల భారం కూడా తహశీల్దార్లపై తీవ్రంగానే ఉంటుందని ఉన్నతాధికారులు సైతం అంచనా వేస్తున్నారు.

భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ రూపకల్పనకు మూడేళ్ల క్రితం రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థతో సీనియర్ ఐఏఎస్ రజత్ కుమార్ షైనీ, వాకాటి అరుణ, రఘునందన్ రావు, హరితతో పాటు పలువురు నిపుణులతో ఏర్పాటైన సమావేశమే ఈ తప్పులకు మూలమని రెవెన్యూ చట్టాల నిపుణుడొకరు ‘దిశ’కు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ‘మా భూమి.. మీ భూమి’ పోర్టల్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ‘మీ భూమి’ ఏపీకి, ‘మా భూమి’ తెలంగాణకు వచ్చాయి. ఆ ‘మా భూమి’ పోర్టల్, ఎల్ఆర్ యూపీ యాప్ డేటాను క్రోడీకరిస్తూ ‘ధరణి’కి శ్రీకారం చుట్టారు. తప్పుల తడకగా ఉందని గుర్తించిన ఆ రెండింటి ఆధారంగానే తయారైంది. మాన్యువల్ రికార్డుల ఆధారంగా క్రోడీకరించడం ద్వారా స్పష్టత, పారదర్శకత లభించేది. ఈ విషయాన్ని ఆ చర్చలో పాల్గొన్న కొందరు వాదించారు. కానీ కిచిడీ వంటి డేటానే విశ్వసించారు.

గతంలో సీఎం కేసీఆర్ కూడా మాన్యువల్ గా పహాణీలు రాయాలని పలుమార్లు ప్రకటించారు. కంప్యూటర్‌ను నమ్మడం ద్వారా విశ్వసనీయత దెబ్బ తింటుందన్న భావనతో అలా అనేవారు. ఇప్పుడేమో పూర్తిగా ధరణిని మూలాధారంగా మార్చడంతోనే అనేక సమస్యలొచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి దాకా ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలేవీ నమోదు కాలేదు. 15 రోజుల్లోనే 100 శాతం పూర్తి చేయించడం ద్వారా మళ్లీ తప్పులతడకగా తయారయ్యే అవకాశం ఉంటుందన్నారు. పారదర్శకత రావాలంటే ఒక్కసారి జమాబందీ నిర్వహణ అనివార్యమంటున్నారు. లేదంటే రికార్డులను సరి చేసుకోవడానికి రైతులకు, హక్కుదారులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేకపోతే అధికారులు, రెవెన్యూ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు చేసిన పొరపాట్లకు కూడా కోర్టుకే వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించడం వల్ల సామాన్యులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోందన్నారు.

సేత్వార్ ఆధారంగానే ధరణి వెబ్ సైట్లో ప్రతి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను విస్తీర్ణంతో సహా నమోదు చేశారు. ఏయే సర్వే నంబర్లల్లోనైతే రికార్డుల్లో అధికంగా విస్తీర్ణం నమోదు చేయబడిందో(పాసు పుస్తకాల ద్వారా) వాటి మ్యూటేషన్లు సాధ్యం కావడం లేదు. సాంకేతిక సమస్యలతోనే భూ యాజమాన్య హక్కులకు సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు భూమి ఉన్నా లేకున్నా పాస్ బుక్కులివ్వడం, భూమి అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా నమోదు చేయకపోవడంతో అంతా గందరగోళంలో పడింది. తెలంగాణ మొత్తంగా దాదాపు 60 లక్షల ఎకరాల భూమి అదనంగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ అదనపు భూమి రికార్డుల్లో ఉంది. కానీ అసలు భూమి లేదు. ఈ క్రమంలో ధరణి పరిష్కారం ఎలా చూపిస్తుందన్న సందేహం కలుగుతోంది.

మండల స్థాయిలో తహసీల్దార్ తీసుకున్న నిర్ణయం ద్వారా అన్యాయానికి గురైన వారు డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా అన్యాయమే జరిగిందని భావిస్తే జాయింట్ కలెక్టర్(ప్రస్తుతం అదనపు కలెక్టర్) దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. పై రెండు స్థాయిల్లో విచారణ చేసి న్యాయం జరిగేటట్లు అవకాశం ఉండేవి. ఇప్పుడేమో తహసీల్దార్ తీసుకునే నిర్ణయం ఫైనల్. అన్యాయం జరిగిందని అనిపిస్తే కోర్టుకు వెళ్లాల్సిందే. దాంతో పేదలు ఇబ్బందులకు గురి కావాల్సిందేనని భూ రెవెన్యూ రికార్డుల నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 15 వేల నుంచి 20 వేల వరకు భూ సంబంధ కేసులు ఉన్నాయి. వాటికి మాత్రమే ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు. కొత్తగా తలెత్తే ఏ సమస్యకైనా సివిల్ కోర్టు ద్వారా తేల్చుకోవాలని చట్టం చెబుతోంది.

రెండు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇంటి స్థలాలకు కార్డులు ఇవ్వడానికి కొత్త పథకాన్ని రూపొందించింది. సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(పీఎం స్వమిత్వ) కార్డులు దేశ వ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధానంగా ఇంటి స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు జారీ చేయాలన్నది లక్ష్యం. తమ ఆస్తులను అమ్ముకునేటప్పుడు, కుదువ పెట్టేందుకు ఈ కార్డులు పని చేస్తాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు పన్ను వసూలు చేయడానికి కూడా ఆస్తి వివరాలను సరిగ్గా లేకపోవడం వల్ల రాబడి తగ్గిపోతుంది. ఈ స్వమిత్వ కార్డుల ద్వారా పక్కాగా రెవెన్యూ వస్తుంది. నాలుగేళ్లలో 6.62 లక్షల గ్రామాల్లో కొత్త టెక్నాలజీ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి స్థలానికి ప్రత్యేక నంబరు కేటాయించి స్వమిత్వ కార్డులు జారీ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పైలెట్ ప్రాజెక్టుగా ఆరు రాష్ట్రాల్లో లక్ష గ్రామాల్లో ఈ సర్వే చేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త నిధులు వెచ్చించి ఈ సర్వే చేయనున్నారు. మహారాష్ట్రలో ప్రజల నుంచే యూజర్ చార్జీలు తీసుకుంటున్నది.

కాగా, సీఎం కేసీఆర్ మాత్రం కేవలం 15 రోజుల్లోనే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేయాలని అధికారులను, చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఐతే ఇప్పటి దాకా ఆబాదికి సంబంధించిన పక్కా రికార్డులే ఏ శాఖ దగ్గర సరిగ్గా లేవు. అలాగే ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలేవీ లేవు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో 100 శాతం నమోదు చేయడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story