ఆటోలో వ‌చ్చావ్‌.. నువ్వు ఎమ్మెల్యేవేంటి?

by Anukaran |
ఆటోలో వ‌చ్చావ్‌.. నువ్వు ఎమ్మెల్యేవేంటి?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: సున్నం రాజయ్య భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గ సీపీఎం అభ్య‌ర్థిగా 1999, 2004, 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆయ‌న మొద‌టి నుంచి నిరాండంబ‌రమైన జీవితాన్ని కొన‌సాగించారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఆయ‌న ఎలాంటి ద‌ర్పాల‌కు పోలేదు. పార్టీ, ప్ర‌భుత్వ‌ కార్య‌క్ర‌మాల‌కు ఎర్ర‌బ‌స్సుల్లోనే హాజ‌ర‌య్యేవారు. అవ‌స‌ర‌మైతే ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్లేవారు. ఇక 2015 ఏప్రిల్ 9న జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఆయ‌న నిరాండంబ‌ర రాజ‌కీయ జీవితానికి నిద‌ర్శ‌న‌మ‌నే చెప్పాలి.

నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌పై స‌చివాల‌యానికి ఆటోలో ఎమ్మెల్యే సున్నం రాజ‌య్య చేరుకున్నారు. సీపీఎం శాసనసభా పక్ష నేతగా కూడా కొన‌సాగుతున్నారు. అయితే ఆటోలో వ‌చ్చిన సున్నం రాజయ్యను సచివాలయం ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. ఆయన సామాన్యులు ప్రయాణించే ఆటోలో వెళ్ళడమే! గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు.. ఆటోలో వచ్చావ్.. నువ్వు ఎమ్మెల్యేవంటే న‌మ్మాలా..?! అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. చివ‌రికి ఆయ‌న త‌న‌ గుర్తింపు కార్డు తీసి చూపించేంత వ‌ర‌కు కూడా వాళ్లు న‌మ్మ‌లేదు. కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట గానీ శాసన సభ్యులు రాజయ్యను పోలీసులు లోనికి అనుమతించలేదు. ఇందులో పోలీసుల త‌ప్పేమీ లేదు. గ‌ట్టిగా మాట్లాడితే వార్డు మెంబ‌ర్లే కార్లు వాడుతున్న కాల‌మిది. ఎమ్మెల్యే ఆట‌లో వ‌చ్చాడంటే ఎందుకు న‌మ్ముతారు చెప్పండి.? ఏది ఏమైనా జీవితాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ఓ క‌మ్యూనిస్టు యోధుడు, విలువ‌ల‌తో రాజ‌కీయ జీవితాన్ని కొన‌సాగించిన ఉన్న‌తుడు నింగికెగిసాడ‌న్న‌ది నిజం.

Advertisement

Next Story