వ్యాపకంతో అలా చేయాలి: అదనపు ఎస్పీ నర్మద

by Shyam |
వ్యాపకంతో అలా చేయాలి: అదనపు ఎస్పీ నర్మద
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు సమాజాభ్యున్నతిలో భాగస్వామ్యం అయ్యి పోలీస్ శాఖ గౌరవం మరింత పెంచాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐలు యాదయ్య, ముస్తఫా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డిలు అందించిన సేవలను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ నర్మద మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడి పని చేసినప్పుడే అందుకు తగిన గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోగలమన్నారు.

ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. పోలీస్ వృత్తి ద్వారా న్యాయం కోసం ఎదురు చూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అయితే ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకంతో సమజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఎక్కడ ఉన్నా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజలలో మరింత పెంచడం, ప్రజలకు పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించేలా రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు చూడాలని ఆమె సూచించారు. పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని ఆమె చెప్పారు.

డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భమని ఆయన చెప్పారు. పిల్లలకు మంచి విద్య అందించడం, ఆరోగ్యాలను రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రతి పోలీస్ విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేస్తున్న అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి పిల్లలు జీవితంలో మంచిగా స్థిరపడే అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు. పదవీ విరమణ పొందిన అధికారులు భావి జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, డిపిఓ సూపరింటెండెంట్ దయాకర్ రావు, పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story