24 గంటల్లో 253 కేసులు

by vinod kumar |
24 గంటల్లో 253 కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఊహించనంత వేగంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇప్పటి వరకు నమోదుకాని విధంగా 253 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు 209 కేసులే అత్యధికం కాగా శనివారం దాన్ని మించి నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒకే కుటుంబంలో 19 మందికి పాజిటివ్ వచ్చింది. ఇటీవల కరోనా పాజిటివ్‌తో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకే కుటుంబంలో 19 మందికి వైరస్ సోకినట్లు తేలింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 182కు చేరుకుంది.

ఇప్పటివరకూ వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు పాజిటివ్ కేసుల జాబితాలో చేరింది. దీంతో కరోనా బారిన పడకుండా రాష్ట్రంలో ఒక్క జిల్లా కూడా లేదు. అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నట్లయింది. ఇటీవలి వరకూ ప్రభుత్వం వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో వైరస్ జాడే లేనందువల్ల అవన్నీ కరోనా రహిత జిల్లాలుగా పేర్కొంది. కానీ ఇప్పుడు అలాంటి కరోనా రహిత జిల్లాలు లేవు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,737కు చేరుకుంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 2,203 మంది చికిత్స పొందుతుండగా 2,352 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన 253 కేసుల్లో.. జీహెచ్ఎంసీలో 179, సంగారెడ్డిలో 24, మేడ్చల్‌లో 14, రంగారెడ్డిలో 11, మహబూబ్‌నగర్‌లో 4, వరంగల్ అర్బన్, రూరల్‌, కరీంనగర్, నల్లగొండ, ములుగు, సిరిసిల్లా, మంచిర్యాల జిల్లాల్లో రెండు చొప్పున నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed