ధరణి సమస్యల భరణి : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

by Shyam |
ధరణి సమస్యల భరణి : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం : రెవెన్యూ శాఖలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకం సమస్యల భరణిగా మారిందని మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. బుధవారం కాటారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి కి అర్హులైన దంపతులకు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య అధ్యక్షత వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ధరణి సర్వరోగ నివారిణిగా ప్రభుత్వం పేర్కొనగా మేము కూడా సమస్యలు తొలగిపోతాయని ఆశించాం, కానీ ఆ విధంగా జరగకుండా గ్రామాల సమస్యలు మూడింతలు పెరిగిపోయాయని ఆరోపించారు. ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ధరణిలో కొన్ని సవరణలకు అవకాశం కల్పించినా అవి పూర్తిస్థాయిలో పరిష్కారానికి అవకాశం లేదన్నారు. మండల కేంద్రమైన కాటారం గారిపల్లి గ్రామంలో పేద ప్రజలకు గతంలో పంపిణీ చేసిన భూమి 501, 431 ఇతర సర్వే నెంబర్లలో నూతన టెక్నాలజీతో సర్వే చేసి హద్దులు నమోదు చేయాలని ఎన్నో సార్లు కలెక్టర్‌కు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఆ దిశగా చొరవ చూపడం లేదని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఎస్సీలకు కమ్యూనిటీ హాల్, ముస్లింలకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, ఈ ప్రాంతంలో భూ సమస్యలు పరిష్కరించి రెవెన్యూశాఖ ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో దరఖాస్తు చేసుకున్న వారికి నెలల తర్వాత సహాయం అందుతుందన్నారు. అలా కాకుండా త్వరితగతిన అందేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌బాబు కోరారు.

పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాల నిర్మాణాలకు సర్పంచులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి నిర్మాణాలు చేయించారని, కొన్ని గ్రామాల్లో బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం కాటారం మహాముత్తారం మండలంలో చెందిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 30 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం జడ్పీటీసీ లింగమల్ల శారద వెంకటస్వామి, తహసీల్దార్లు శ్రీనివాసాచారి, శ్రీనివాస్, కాటారం ఎంపీడీవో ఆంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ రవీందర్రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed