కురుమూర్తి రాయ గోవింద.. గోవిందా..! అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

by Shyam |
కురుమూర్తి రాయ గోవింద.. గోవిందా..! అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనం… శివసత్తుల పూనకాలు.. దా సంగాల అలంకరణలు…గోవింద నామస్మరణల మధ్య మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మ పూర్ గ్రామంలో కాంచన గుహలలో వెలసిన ‘కురుమూర్తి రాయుడి’ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భావించబడే కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన ఉద్దాల ఉత్సవాలు కన్నుల పండువగా.. శోభాయమానంగా .. అశేష భక్త జనం మధ్య సాగాయి. నెల రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలలో ఉద్దాల( స్వామివారి పాదరక్షల) ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉండడంతో ఆ వేడుకలు జరిగే రోజున ఉమ్మడి పాలమూరు జిల్లా తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భక్తజనం భారీ ఎత్తున హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో తరతరాలుగా వడ్డెమాన్ గ్రామంలో హరిజన కుటుంబాలు తయారుచేసే స్వామివారి ఉద్దాల కు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని ఊరేగింపుగా తిరుమలాపూర్ గ్రామం వద్దకు తీసుకువచ్చారు.

అప్పటికే పల్లమల్లి గ్రామం నుండి సాంప్రదాయంగా తీసుకువచ్చే చాటను భక్తులు తీసుకురాగా తిరుమలాపురం గ్రామం వద్ద మరోమారు పూజలు నిర్వహించారు. చాటలో స్వామివారి ముత్యాల నుంచి అలంకరించిన ప్రత్యేక వాహనం ద్వారా ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామివారి ఉద్దాల ను తాకడం, ఆ ఉద్దాలు ఉంచిన చాట మొయ్యడం, లేదా ఆ చాట కిందినుండి వెళ్లడం ద్వారా తమ కష్టాలు తీరి అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనం స్వామివారి ఉద్దాలకు మొ క్కడం, చేట కిందినుండి వెళ్లడానికి పెద్ద ఎత్తున పోటీలు పడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. భక్తుల కేరింతలు.. శివసత్తుల పూనకాలు.. గోవింద నామస్మరణలతో ఉద్ధాలు సాయంత్రానికి ఆలయానికి చేరుకున్నాయి.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్. యువజన సర్వీసులు, క్రీడలు, సంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ కుమార్ గౌడ్, బిజెపి నేత పవన్ కుమార్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ ప్రాంగణానికి ఉద్దాలు చేరిన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు మరింత ఉత్సాహంగా సాగనున్నాయి. జాతరలో స్వామివారికి కొత్త కుండలో అన్నం. పచ్చి పులుసు తో తయారు చేసే నైవేద్యాన్ని స్వామికి సమర్పించడం మరో ప్రత్యేకత. పేద ధనిక అనే తేడాలు లేకుండా భక్త జనం తరలిరావడంతో కురుమూర్తి ప్రాంగణం అంతా భక్త జన మయంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed