ధోనీకి కోపమొచ్చిన వేళ..

by vinod kumar |
ధోనీకి కోపమొచ్చిన వేళ..
X

క్రికెట్ ప్రపంచంలో ధోనీ పేరు చెప్పగానే అందరూ ‘మిస్టర్ కూల్’ అనే అంటారు. ఎంతటి క్లిష్టమైన మ్యాచ్ అయినా, అందరూ టెన్షన్‌తో ఉన్నా కూల్‌గా ఉండటమే ధోనీ లక్షణం. ఎంత ఒత్తిడిలో ఉన్నా అస్సలు టెన్షన్ పడుతున్నట్లు కనిపించడు.. ఎదుటి వారిని టెన్షన్ పెట్టడు. ముఖ్యంగా ఫీల్డ్‌లో ఉన్నప్పుడు బౌలర్లకు, ఫీల్డర్లకు సలహాలు ఇస్తుంటాడు తప్ప వారిపై కోపగించుకోవడం చాలా అరుదు. అలాంటి ధోనీ ఒకసారి కుల్దీప్ యాదవ్‌పై అరిచేశాడట. ఆ విషయాన్ని కుల్దీప్ స్వయంగా చెప్పాడు. ‘2017లో శ్రీలంకతో ఒక వన్డే మ్యాచ్ జరిగింది. నా బౌలింగ్‌లో కుశాల్ పెరీరా కవర్స్ మీదుగా బౌండరీ బాదాడు. అప్పుడు కీపింగ్ చేస్తున్న ధోనీ.. ఫీల్డింగ్ మార్చమని చెప్పాడు. కానీ నేను ధోనీ మాటలను పట్టించుకోకుండా తర్వాతి బంతి వేశాను. దాన్ని కుశాల్ రివర్స్ స్వీప్ చేసి ఫోర్ కొట్టాడు. అంతే ధోనీ కోపం కట్టలు తెంచుకుంది. నా దగ్గరకు వచ్చి నేనేమైనా పిచ్చోడినా.. 300 వన్డేలు ఆడాను.. ఏ బ్యాట్స్‌మన్ ఎలా ఆడతాడో తెలియదా.. నేను చెప్పిన మాట నువ్వు వినలేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు” అని కుల్దీప్ చెప్పాడు.

కాగా, ఆ రోజు ధోనీని చూస్తే తనకు చాలా భయం వేసిందని.. మ్యాచ్ తర్వాత ధోనీని ఎలా కలవాలా అని ఆలోచించి.. చివరకు తన దగ్గరకు వెళ్లి ‘ఏంటి భాయ్ ఇలా కోప్పడ్డావ్’ అని అడిగా.. మరేం చేస్తాం 20 ఏండ్ల నుంచి కోప్పడలేదు.. అంతా ఒకేసారి బయటకు వచ్చేసింది అంటూ నవ్వేశాడని కుల్దీప్ చెప్పాడు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా క్రికెట్ మ్యాచులు వాయిదా పడటంతో ఆటగాళ్లు తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కుల్దీప్ ఈ విషయాలు వెల్లడించాడు.

Tags: MS Dhoni, Kuldeep Yadav, Instagram, Kusal Perera, Sri Lanka

Advertisement

Next Story

Most Viewed