హుజూరాబాద్‌కు కేటీఆర్ దూరం.. కారణం అదేనా?

by Shyam |   ( Updated:2021-09-15 22:11:26.0  )
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి అనుకున్న టార్గెట్ చేరుకున్నారు. హుజూరాబాద్ లో గెలుపే లక్ష్యంగా పార్టీ ఓ వైపు సర్వశక్తులు ఒడ్డుతుండగా… కేటీఆర్ మాత్రం చిన్న ఎన్నికంటూ కొట్టిపారేస్తున్నారు. గెలిచినా.. ఓడినా ఒరిగేదేమీలేదంటూ పేర్కొంటున్నారు. పార్టీ గెలుపు బాధ్యతను మొత్తం ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీష్ రావుకు అప్పగించి ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రభావం చూపుతాయని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీజేపీ ఈటలను అభ్యర్థిగా ప్రకటించి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సైతం తనదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం లైట్ గా తీసుకుంటూనే.. మరో పక్కా గెలుపుకోసం వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రచారంతో దళిత బంధుపై దళితుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వివరించాలని సూచిస్తున్నారు. ప్రతి కుటుంబం లబ్దిపొందిన తీరును వివరించేలా చర్యలు చేపడుతున్నారు. గెలుపుపై మార్గనిర్దేశం చేస్తున్నారు.

రాష్ట్రంలో గతంలో జరిగిన హుజూర్ నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ప్రచారానికి కూడా కేటీఆర్ దూరంగా ఉన్నారు. అయితే మూడింటిలో ఒక దుబ్బాకలో మాత్రం టీఆర్ఎస్ ఓటమిపాలైంది. ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్నా హరిష్ రావు మంత్రం పనిచేయలేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర ప్రజలు సైతం తమ దృష్టిని కేటాయించారు. గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రచారం చేస్తే కొంత కలిసి వస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయినప్పటికీ మంత్రి హరీష్ రావుకు పూర్తి బాధ్యతలు అప్పగించడంతో కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. హరీష్ బాధ్యతలు తీసుకున్న మున్సిపాలిటీలు గానీ, నియోజకవర్గాలు గానీ, గ్రామాల్లో గానీ కేటీఆర్ ప్రచారం చేయలేదు. ఇప్పుడు కూడా హరీష్ రావుకు హుజూరాబాద్ గెలుపు బాధ్యతను అప్పగించడంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలు ఒక ఎత్తు అయితే … హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఒక ఎత్తని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ కు నియోజకవర్గంలో పట్టుండటం, ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోతుందనే ప్రచారం జరుగుతుండటంతో ఈ ఉపఎన్నిక కీలకంగా మారింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపుకోసం గత రెండు నెలలుగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సైతం సంక్షేమ పథకాలకు హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు చేపడుతుంది. ఏదీ ఏమైనప్పటికీ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే కేటీఆర్ ప్రచారం చేయడం లేదనే ప్రచారం జరుగుతుండటం కొసమెరుపు.

Advertisement

Next Story

Most Viewed