రామన్న బీజేపీ.. కవితక్క కాంగ్రెస్.. అదేమిటి..?

by Anukaran |   ( Updated:2020-11-21 06:09:31.0  )
రామన్న బీజేపీ.. కవితక్క కాంగ్రెస్.. అదేమిటి..?
X

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా విమర్శలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపున అన్న కేటీఆర్, చెల్లి కవిత సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్విట్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు స్పందించే వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులపై విమర్శల బాణాలు విసురుతున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ఘాటుగానే బదులిస్తుండగా… కవిత మాత్రం కాంగ్రెస్ కామెంట్లపైనే ఫోకస్ పెట్టారు. గత నాలుగైదు రోజులుగా ట్విట్టర్ ద్వారా అన్నాచెల్లెళ్ళు బీజేపీ, కాంగ్రెస్ కామెంట్లపై విరుచుకుపడుతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాత్రమే అనే వాతావరణం నెలకొనడంతో ముఖ్యమంత్రికి బీజేపీ నేత బండి సంజయ్ సవాలు విసిరారు. దేశద్రోహి అంటూ ఆరోపణలు చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న మజ్లిస్‌తో అంటకాగుతున్నందున కేసీఆర్ కూడా దేశద్రోహి అంటూ ఘాటుగానే ఆరోపణలు చేశారు. చైనా, పాకిస్తాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని తప్పుపడుతున్నందున కేసీఆర్‌ను ఘాటు పదాలతోనే విమర్శించారు. ఈ విమర్శలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ బీజేపీ నేతలకు ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు.

టీఆర్ఎస్, బీజేపీలు లోపాయకారీ ఒప్పందం పెట్టుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్లులకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలికిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం మౌనంగానే ఉన్నారని, ఇప్పుడేమో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మోడీ-షా ద్వయానికి ఎప్పుడంటే అప్పుడు మద్దతు ఇచ్చే (ఏటీఎం-ఎనీ టైం మోడీ) బీ-టీమ్ (బీజేపీకి)లో కేసీఆర్, నవీన్ పట్నాయక్, జగన్ ముందువరుసలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ కామెంట్లకు కవిత కూడా గట్టిగానే స్పందించి హైదరాబాద్ వరద సాయాన్ని ఆపేయాల్సిందిగా కాంగ్రెస్ లేఖ రాసిందని ఆరోపించారు. నాలుగైదు రోజులుగా వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా విమర్శల, ప్రతివిమర్శల పర్వం కొనసాగుతోంది.

సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న తర్వాత కేటీఆర్ ఎక్కువగా బీజేపీపైన, కవిత ఎక్కువగా కాంగ్రెస్ పైన ఫోకస్ పెట్టడం గమనార్హం.

Advertisement

Next Story