హుజురాబాద్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌కు షాక్

by Anukaran |   ( Updated:2021-07-12 05:47:46.0  )
Padi Kaushik Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ కాంగ్రెస్ యువ నేత కౌశిక్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారని సమాచారం. త్వరలో ఆయన గులాబీ గూటికి చేరనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు కాంగ్రెస్ అభ్యర్థిగా తన గెలుపుకంటే బీజేపీ అభ్యర్థి ఈటల గెలుపుకే ఎక్కవ మద్దతు ఇస్తున్నారని, అందుకే ఈ నిర్ణయమని తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల కుమ్మక్కు రాజకీయ వ్యవహారాలను త్వరలోనే రాహుల్ గాంధీ, సోనియాగాంధీకి కౌశిక్ రెడ్డి లేఖ రూపంలో తెలుపుతారని తెలుస్తుంది.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌ను కౌశిక్ రెడ్డి ఆశిస్తున్నారు. కానీ ఇటీవల మంత్రి కేటీఆర్‌ను కలవడంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండి టీఆర్‌ఎస్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నాయి. దీంతో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ప్రచారం సాగుతోంది. తాజాగా హుజురాబాద్ టీఆర్‌ఎస్ టికెట్ తనకేనంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ కావడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం కోరింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి రాజీనామా చేయనున్నారని వార్తలొస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed