అజ్ఞాతం వీడి హ్యాపీగా జీవించండి : ఎస్పీ సునీల్ దత్

by Sridhar Babu |   ( Updated:2021-07-06 01:46:44.0  )
sp-sunil-dutt
X

దిశ, భద్రాచలం : మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల జీవనోపాధికి ప్రభుత్వపరంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కరోనా బారినపడి వైద్యం అందక అరణ్యంలో ప్రాణాలు కోల్పోవడం కంటే కుటుంబ సభ్యుల ద్వారా వచ్చి లొంగిపోతే మెరుగైన వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న 21 మంది కుటుంబ సభ్యులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చర్ల పోలీస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్‌పీ సునీల్‌‌దత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో సిద్ధాంతాల కోసం ఎవరూ పనిచేయడంలేదని, అగ్రనాయకులు అంతా వారి స్వలాభం కోసమే మావోయిస్టు పార్టీలో ఉంటున్నారని తెలిపారు. అమాయక ఆదివాసీలను నయానో, భయానో పార్టీలో చేర్చుకుని వారి జీవితాలను బలిచేస్తున్నారని అన్నారు.

భార్యా బిడ్డలు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాల్సిన వారు కుటుంబ సభ్యులకు దూరమై అడవుల్లో అనుక్షణం ప్రాణభయంతో బతుకుతున్నారని వివరించారు. మావోయిస్టు పార్టీలో చేరిన తమ వారికి కుటుంబ సభ్యులు వత్తిడి పెంచి వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేయాలని ఎస్‌‌పీ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీని వీడి బయటకువస్తే వారి జీవనానికి కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరపున అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డి తిరుపతి మాట్లాడుతూ.. ప్రస్తుతం మావోయిస్టులంతా కరోనా సమస్యతో బాధపడుతున్నారని వీరికి అడవులలో సరైన వైద్య సదుపాయాలు అందడంలేదని, మావోయిస్టు పార్టీని వీడి బయటకు వస్తే ప్రభుత్వం నుంచి మెరుగైన వైద్య సదుపాయం అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్‌ మాట్లాడుతూ.. ఆదివాసీ గ్రామాలలో మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు. అటవీప్రాంత ఆదివాసీలు శుభ్రమైన నీరు తాగేలా ప్రతి ఇంటికీ వాటర్ ఫిల్టర్, దోమలబారిన పడకుండా దోమతెరలు పంపిణీ చేశామన్నారు. ఆదివాసీ పిల్లల ఆన్‌లైన్ చదువుల కోసం ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రతి గ్రామంలో టీవీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.‌ మావోయిస్టు పార్టీలో చేరిన వారి కుటుంబాలకు పోలీసులు నిత్యావసర వస్తువులు, 25 కేజీల బియ్యం, దుస్తులను ఎస్‌పీ సునీల్‌‌దత్ చేతులమీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో చర్ల సీఐ బి.అశోక్, దుమ్ముగూడెం సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, చర్ల ఎస్ఐలు రాజు వర్మ, వెంకటప్పయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story