కేటీఆర్ బర్త్‌డే.. టీఆర్‌ఎస్‌కు బిగ్ షాకిచ్చిన ఆర్తిక గౌడ్

by Anukaran |   ( Updated:2021-07-24 06:05:21.0  )
కేటీఆర్ బర్త్‌డే.. టీఆర్‌ఎస్‌కు బిగ్ షాకిచ్చిన ఆర్తిక గౌడ్
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఆదిభట్ల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సరస్వతి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ ఆర్తిక గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ కు వ్యతిరేకంగా ఆమె నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆమె చేపట్టిన ఈ నిరసన అటు టీఆర్ఎస్ శ్రేణులనే కాదు అన్ని రాజకీయ వర్గాలను షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం ఆమె వ్యవహారం టాక్ ఆఫ్ ది పొలిటికల్ టౌన్ గా మారింది. ఇంతకీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఆమె ఏం చేశారో తెలుసుకోవాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.

కేటీఆర్ బ‌ర్త్ డే రోజున చెట్లు నాటాల‌ని ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ సరస్వతి స‌ర్క్యుల‌ర్ జారీ చేశారు. దీనిపై చైర్ పర్సన్ ఆర్తిక అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె సర్క్యులర్ జారీ చేయ‌డంలో ఆంత‌ర్యం ఏమిటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ చాంబ‌ర్ ఎదుట నేల‌పై కూర్చొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్తిక మాట్లాడుతూ క‌మిష‌న‌ర్ స‌ర‌స్వ‌తి ఒక అధికారిణిలా కాకుండా, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. కేటీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చెట్లు నాటాల‌ని సీడీఎంఏ, సీఎస్ నుంచి ఏమైనా ఆదేశాలు వ‌చ్చాయా? ఎందుకు స‌ర్క్యుల‌ర్ జారీ చేశార‌ని నిలదీశారు. మున్సిపాలిటీ ప‌రిధిలో ఏ మీటింగ్‌లు జ‌రిగినా స‌మాచారం ఇవ్వ‌డంలేద‌ని, ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని ఆరోపించారు. మున్సిపాలిటీ ప‌రిధిలో అధికారులే ప‌ని చేస్తుంటే… ప్ర‌జాప్ర‌తినిధులుగా మేముండి ప్ర‌యోజ‌న‌మేంట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మున్సిపాలిటీ తీర్మానించిన రూ.8కోట్ల ప‌నుల‌ను చేయించ‌కుండా ప‌క్క‌న‌పెట్టార‌ని, సీఆర్ అయిన త‌ర్వాత ప‌నులు ఆప‌డం క‌క్ష‌పూరిత‌మేన‌ని మండిపడ్డారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స‌ర‌స్వ‌తి చేసిన అవినీతిపై త‌మ ద‌గ్గ‌ర అన్ని ఆధారాలున్నాయ‌ని, కౌన్సిల్‌కు చెప్ప‌కుండా నిధులు డ్రా చేశార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి, పుర‌పాల‌క మంత్రికి, క‌లెక్ట‌ర్‌కు, సీడీఎంఏ, సీఎంవో అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కేటీఆర్ బర్త్ డే రోజున మొక్కలు నాటాలని అధికారులు పురమాయించడంపై ప్రతిపక్ష నాయకులు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాంటిది మున్సిపల్ చైర్ పర్సన్ నేల మీద కూర్చుని నిరసన తెలపడం సంచలనంగా మారింది.

Advertisement

Next Story