వన్డే క్రికెట్‌కు కోహ్లీ దూరం.. BCCIలో ముంబై లాబీయింగ్..?

by Anukaran |   ( Updated:2021-12-11 08:45:49.0  )
వన్డే క్రికెట్‌కు కోహ్లీ దూరం.. BCCIలో ముంబై లాబీయింగ్..?
X

దిశ, స్పోర్ట్స్: విరాట్ కోహ్లీ.. మైదానంలో ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడో.. అంతే దూకుడుగా జట్టును నడిపిస్తుంటాడు. ధోని హయాంలో జట్టులో పెద్దగా అగ్రెషన్ కనపడేది కాదు. కానీ కోహ్లీ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత తన ఆటిట్యూడ్‌ను అందరికీ పంచేశాడు. ప్రతీ మ్యాచ్‌ను గెలవడం కోసమే ఆడాలనే రాసుకోని నిబంధనను విధించాడు. అందుకే కోహ్లీ ఆడిన మ్యాచ్‌లలో విజయాల శాతం ఎక్కువ. వన్డేల్లో 70.43 శాతం, టెస్టుల్లో 59.19 శాతం మ్యచ్‌లను కెప్టెన్‌గా గెలిపించాడు.

మూడు ఫార్మాట్లలో 50కి పైగా విజయాలు ఉన్న ఏకైక కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే. ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్భుతమైన విజయాలను అందుకున్నా.. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒక్క టైటిల్ గెలవలేదు. కోహ్లీని ప్రతీ సారి పోల్చి చూసేసి కేవలం ఐసీసీ టైటిల్స్ విషయంలోనే. మిగతా విషయాల్లో కోహ్లీ దరిదాపుల్లోకి ఎవరూ రారనేది అతడి రికార్డులే చెబుతుంటాయి. అలాంటి కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ముందు తీసుకున్న నిర్ణయం.. అతడికి వైట్ బాల్ క్రికెట్‌నే దూరం చేసేలా మారిపోయింది. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీని తను వదిలేస్తే.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ బలవంతంగా దూరం చేసింది. దీంతో కోహ్లీ తీవ్ర నిరాశలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి వన్డేలకు దూరం?

విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదిలేసిన తర్వాత న్యూజీలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడలేదు. విశ్రాంతి కోసం అతడిని పక్కన పెట్టారు. అయితే కివీస్‌పై 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత జరిగిన కీలక సమావేశంలో అతడి వన్డే కెప్టెన్సీని తీసేశారు. కోహ్లీకి వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని లేకపోయినా.. బీసీసీఐ అతడిని బలవంతంగా పక్కన పెట్టినట్లు సమాచారం. బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు పలు కారణాలు చెబుతున్నా.. ముంబై లాబీయింగ్ కూడా కోహ్లీ వన్డే కెప్టెన్సీ పోవడానికి కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా సమావేశానికి పిలిచి అవమానించారని కోహ్లీ భావిస్తున్నాడు. గతంలో ధోని కెప్టెన్సీ వదిలేసి కోహ్లీకి కట్టబెట్టాలనుకున్నప్పుడు సెలెక్టర్లు ఇలాంటి సమావేశాలు నిర్వహించలేదు. కానీ ఇప్పుడు సుదీర్ఘంగా రెండు రోజుల పాటు కూర్చోబెట్టి తనను తీసేశారని కోహ్లీ చాలా అవమానంగా భావిస్తున్నాడు. అందుకే ప్రస్తుతానికి వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని అనుకున్నట్లు తెలుస్తున్నది. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు మ్యాచ్‌లకు పూర్తి జట్టును ప్రకటించినా.. వన్డేలకు మాత్రం ఇంకా జట్టును ఖరారు చేయలేదు. కోహ్లీ ఆడతాడో లేదో అనే అనుమానంతోనే ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.

టెస్టులు ముగిసిన తర్వాత ఇంటికే..

దక్షిణాఫ్రికాలో టీమ్ ఇండియా మూడు టెస్టులు ఆడనున్నది. ఆ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేయడానికి కోహ్లీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. తాను టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పిన రోజు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతడికి నచ్చజెప్పినట్లు చెప్పాడు. టీ20 కెప్టెన్సీ వదిలేయవద్దని సలహా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మరి అదే సమయంలో టీ20 కెప్టెన్సీ వదిలేస్తే వన్డేలకు కూడా కెప్టెన్‌గా ఉండకూడదనే విషయాన్ని గంగూలీ ఎందుకు చెప్పలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆరోజే చెప్పి ఉంటే కోహ్లీ నిర్ణయం మరోలా ఉండేది కదా అని అంటున్నారు. ఏదేమైనా కెప్టెన్సీ విషయంలో కోహ్లీ తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. అందుకే టెస్టులు మాత్రమే ఆడుతూ కొన్నాళ్లు వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

గంగూలీ అసలు అలా అడగలేదు : కోహ్లీ కోచ్

అంత ఈజీ కాదు కెప్టెన్ రోహిత్ శర్మ.. అజహరుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed