వరదను ఆదాయ వనరుగా మార్చుకున్న మహిళ

by Shyam |
వరదను ఆదాయ వనరుగా మార్చుకున్న మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్ : మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఉత్తర్‌ప్రదేశ్, కన్నౌజ్‌, బథువా గ్రామానికి చెందిన కిరణ్ కుమారి రాజ్‌పుత్ మరోసారి నిరూపించింది. చదివింది పదో తరగతే కానీ తెలివితేటల్లో ఆమె ఘనాపాఠి. తన పొలాన్ని ఓ అద్భుతమైన ఐలాండ్‌గా తీర్చిదిద్దిన కిరణ్ కుమారిని చుట్టుప్కల వాళ్లే కాదు గూగుల్ కూడా అభినందించడం విశేషం. ఇంతకీ ఆమె ఏం చేసింది?

చాలామంది రైతులు తమ పొలానికి నీళ్ల సౌకర్యం లేకపోతే దానిపై ఆశలు వదిలేసుకుంటారు. అతి కొద్దిమంది మాత్రమే బిందు సేద్యం, బావుల తవ్వకం చేపట్టి మోడువారిన బీళ్లలో పచ్చని బంగారాన్ని పండిస్తారు. నీటి కరువున్నప్పుడు ఇలా ఆలోచిస్తారు సరే.. పంటపొలాలన్నీ నీటిలో మునిగిపోతే ఏం చేస్తారు? వరద సాయం కోసం ఎదురు చూస్తారు. ఇవ్వకపోతే అప్పు చేసి మరోసారి పంట వేస్తారు. కానీ కిరణ్ కుమారి అందరికంటే భిన్నంగా ఆలోచించింది. తన పంట భూమిని వరదలు ముంచెత్తగా, దాన్నే ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకున్న కిరణ్ కుమారి.. ఆ నీళ్లతోనే ఓ తటాకాన్ని తీర్చిదిద్దింది. అందుకోసం ప్రభుత్వ పథకంలో భాగంగా రూ. 2 లక్షల రుణం తీసుకుంది. మరికొంత అప్పు చేసి ఆ నీళ్లలో చేపల పెంపకాన్ని చేపట్టింది. అలా ముంచెత్తిన వరదలను తన పొలానికి అనుకూలంగా చేసుకుని, ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆ నీటి మధ్యలో మిగిలిన భూమిలో మామిడి, అరటి, బొప్పాయి మొదలైన పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలను కూడా పెంచింది.

చెరువును తలపించే తటాకం, ఆ నీటి మధ్యలో పూల, పండ్ల పెంపకం.. వెరసి అదో అద్భుత ద్వీపంలా కనిపించసాగింది. దాంతో చుట్టు పక్కలా వాళ్లంతా ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చేవాళ్లు. దీంతో ఈ ప్రాంతం అందమైన పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. కిరణ్ కుమారి కష్టం ఇప్పుడు తనకు లాభాలు తెచ్చిపెడుతోంది. చేపలు, పండ్ల వ్యాపారంతో ఆమె ఏటా రూ.25 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కాగా ఈ ఐల్యాండ్‌ను గుర్తించిన గూగుల్.. దీనిని తీర్చిదిద్దిన మహిళకు ఇటీవలే ప్రశంసలతో కూడిన సర్టిఫికెట్‌ను అందజేసింది.

Advertisement

Next Story

Most Viewed