హైదరాబాద్‌లో కేసులు పెరుగుతున్నాయ్.. జర భద్రం!

by Shyam |
హైదరాబాద్‌లో కేసులు పెరుగుతున్నాయ్.. జర భద్రం!
X

– సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో : ‘దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కంటైన్‌మెంట్ క్లస్టర్ల నిర్వహణ బాగా జరగాలి. ఆ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరినీ బయటకు రానీయొద్దు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారు ఉంటున్న ప్రాంతాలకు సమీపంలో ఉన్న బస్తీల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలి. వైరస్ సోకినవారి ద్వారా ఇంకా ఎవరికి సోకవచ్చు అనే విషయాలను కచ్చితంగా నిర్ధారించి పరీక్షలు జరపాలి. ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలు చేస్తున్న పద్ధతులను యథాతథంగా అమలు చేయాలని, లాక్‌డౌన్ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నివారణ, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్ లో శనివారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం జరిగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. లాక్‌డౌన్ వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, వలస కూలీలు, రోజువారీ కార్మికులను గుర్తించి వారికి తగిన సాయం అందించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ కార్యక్రమాలు యథావిధిగా జరిగేట్లు చూడాలని, కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని, ఈ సమయంలో ఎవరికి ఏ ఆపద, ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎస్ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు శాంతికుమారి, నర్సింగ్ రావు, రామకృష్ణారావు, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags : Telangana, Corona, CM KCR, Reveiw, Hyderabad, Positive Cases

Advertisement

Next Story

Most Viewed