వ్యాక్సిన్ పంపిణీ: కేసీఆర్ సంచలన ప్రకటన.. ముందే చెప్పిన ‘దిశ‘

by Anukaran |   ( Updated:2021-04-24 05:05:25.0  )
వ్యాక్సిన్ పంపిణీ: కేసీఆర్ సంచలన ప్రకటన.. ముందే చెప్పిన ‘దిశ‘
X

దిశ,తెలంగాణ బ్యూరో : “ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు. అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం. రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకాలు ఇస్తాం. ఇందుకు సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయినా వెనకాడం“ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, వైద్యారోగ్య శాఖ అధికారులకు ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వారందరికీ టీకాలు ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురైన కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. దీన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ రెండు-మూడు రోజుల్లో అవసరమైన వైద్య పరీక్షలను చేయించుకుని పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇన్‌చార్జిలను నియమించనున్నట్లు తెలిపారు.

భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే టీకాలను తయారుచేస్తున్నదని, రెడ్డి ల్యాబ్స్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా తయారీకి ముందుకొచ్చాయని, అందువల్ల టీకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. రెమిడెసివిర్‌తో పాటు కొన్ని కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నదని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, పెద్ద ఎత్తున శానిటేషన్ కూడా చేపట్టిందని సీఎం భరోసా ఇచ్చారు. ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వుండవద్దని కోరారు.

పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా జమకావద్దని, ఊరేగింపుల్లో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, స్వీయ క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందని కేసీఆర్ నొక్కిచెప్పారు.

22-4-2021 రాష్ట్రంలో ఫ్రీ వాక్సిన్ ఇవ్వనున్నట్టు ‘దిశ’ ప్రచురించిన కథనం

Advertisement

Next Story

Most Viewed