ఊహాగానాలకు తెర

by Shyam |
ఊహాగానాలకు తెర
X

దిశ, న్యూస్‌బ్యూరో:
రాష్ట్రం నుంచి ఎన్నిక జరగాల్సిన రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావుకు మరోసారి అవకాశం కల్పించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరో సీటుకు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని ఖరారు చేశారు. మొదటి స్థానం విషయంలో ఎలాంటి సస్పెన్స్ లేనప్పటికీ రెండోసీటు విషయంలో మాత్రం చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి తదితరుల పేర్లకు చక్కర్లు కొట్టాయి. కానీ, చివరకు చర్చల్లో లేని సురేష్‌రెడ్డి పేరు ఖరారైంది. తొలుత సురేష్‌రెడ్డిని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ సురేష్‌రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి శుక్రవారం చివరి రోజు కావడంతో మధ్యాహ్నంలోపే వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేస్తారని టీఆర్ఎస్ కార్యాలయం పేర్కొంది.

రెండోసారి అవకాశం కోల్పోయిన దామోదరరావు

నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న డి.దామోదర్‌రావుకు నాలుగేళ్ళ కిందటే రాజ్యసభ సీటు దాదాపుగా ఖరారైపోయింది. కానీ, ఆ సమయంలో మియాపూర్ భూకుంభకోణం వెలుగులోకి రావడం, అందులో ఆయనకు ప్రమేయముందన్న ఆరోపణలుండడంతో అప్పుడు అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత రెండేళ్ళ కిందట మళ్ళీ అలాంటి అవకాశం వచ్చినా చివరి నిమిషంలో తారుమారైంది. ఇప్పుడు కూడా దాదాపుగా ఆయన పక్కగా రాజ్యసభకు వెళ్తారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరయ్యే సమయంలో కేసీఆర్ తన వెంట దామోదరరావును తీసుకెళ్లడం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. కానీ, సురేష్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో మూడోసారి దామోదరరావు రాజ్యసభ అవకాశాన్ని కోల్పోయారు.

పొంగులేటికి పొగ పెట్టినట్లే..

రాజ్యసభకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దాదాపు ఖాయమనే వార్తలు గత రెండు, మూడు వారాలుగా వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వడానికి బదులుగా నామా నాగేశ్వరరావుకు అవకాశం కల్పించారు. ఆ సమయంలోనే రాజ్యసభ అవకాశం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ నమ్మకంతో ఆయన ఢిల్లీలోని బంగళాను దాదాపు ఏడాదిపాటు ఖాళీ చేయకుండా ఉంచుకున్నారు. చివరకు నోటీసులు రావడంతో దాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పక తప్పలేదు. ఎలాగూ రాజ్యసభకు వెళ్తానన్న ధీమాతోనే ఏడాదిపాటు అద్దె చెల్లించి మరీ తన పేరు మీదే ఉంచుకున్నారు. కానీ, ఇప్పుడు రాజ్యసభ అవకాశం కూడా చేజారిపోయింది.

పొంగులేటికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం ఆ జిల్లా టీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం ఇష్టం లేదు. పార్టీ కంటే ఒక వ్యక్తిగా ఆయన పవర్ సెంటర్‌గా మారుతారని, ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చెడిపోతుందని జిల్లా నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఒక దశలో మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు కొద్దిమంది కూడా పొంగులేటికి అవకాశం ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ విషయం చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధ్యక్షుడు కేసీఆర్ వరకూ వెళ్ళింది. ఇదే జిల్లాకు చెందిన హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డికి అవకాశం కల్పించడానికి కేసీఆర్ మొగ్గు చూపినట్లూ వార్తలు వచ్చాయి. ఎవరికి టికెట్ ఇచ్చినా జిల్లాలోని పార్టీ పరిస్థితులపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో చివరకు కేఆర్ సురేష్‌రెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు. మొత్తానికి జిల్లా పార్టీ నేతల మాటే చెల్లుబాటైంది. ఇక పొంగులేటి భవిష్యత్ వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ అవకాశాలను కోల్పోయిన పొంగులేటికి ఇకపైన ఎలాంటి గౌరవం లభిస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది.

Tags: Telangana, TRS, Rajyasabha, KK, Suresh Reddy

Advertisement

Next Story