ప్రభుత్వానికి మిల్లర్ల సెగ

by Shyam |
ప్రభుత్వానికి మిల్లర్ల సెగ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ సర్కారుకు మిల్లర్ల నుంచి సెగ తగిలింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తే.. ఊరుకోబోమంటూ జిల్లా అధికార యంత్రాంగం నాలుగైదు రోజులుగా ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే మిర్యాలగూడ పరిధిలోని అవంతిపురంలోని ఓ రైసు మిల్లు యాజమాన్యం.. సన్నరకం వడ్లను తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తోందంటూ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దాడి చేసి ఆ మిల్లును సీజ్ చేశారు. దీంతో సన్నరకం ధాన్యం కొనుగోళ్ల కథంతా అడ్డం తిరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైసు మిల్లర్ల నుంచి అధికారుల తీరుపై నిరసన వ్యక్తమైంది. అకారణంగా మిల్లు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ధాన్యం కొనుగోళ్లను నిలిపేశారు. ఇదే సమయంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదంటూ రైతులు నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో 3వేల ట్రాక్టర్ల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. నియంత్రిత సాగు పేరుతో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీగా సన్నరకం పంటను సాగు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలం కావడంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సన్నరకం ధాన్యానికి పూర్తి మద్దతు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కాగా రైస్ మిల్లుల యాజమాన్యాలు మాత్రం.. నాణ్యత లేని ధాన్యానికి పూర్తి ధర చెల్లించి మేం నష్టపోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు సమస్య ఇదీ..

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి దొడ్డు రకం విషయంలో ఎలాంటి సమస్యా లేదు. సన్నరకం విషయంలోనే సమస్య ఎదురవుతోంది. ఏటా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సాగర్ ఆయకట్టు పరిధిలోనే ఎక్కువగా సన్నరకాన్ని పండించేవారు. నియంత్రిత సాగు విధానం వల్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నరకం వరి సాగు పెంచేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు పూర్తి అవగాహనతో ఉండడంతో పాటు చాలా మెళకువలు పాటించడం వల్ల పంటలో నాణ్యత పెరుగుతుందని రైసుమిల్లర్లు చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లోని రైతులకు అవగాహన ఉండదని, అందువల్ల నాణ్యత తగ్గిందని మిల్లర్లు చెబుతున్నారు. అందుకే అన్నిరకాల సన్న వడ్లకు పూర్తిస్థాయి మద్దతు కేటాయించట్లేదని, నాణ్యత ఉన్న సన్నరకం ధాన్యానికి పూర్తిస్థాయి ధర చెల్లిస్తున్నామంటున్నారు.

టాస్క్‌ఫోర్స్ దాడులు

రైతులు పండించిన ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా టాస్క్‌ఫోర్స్ బృందం ఏకంగా ఓ రైసు మిల్లును సీజ్ చేసింది. దీంతో అధికారుల తీరుపై రైసు మిల్లుల యాజమాన్యాలు భగ్గుమన్నాయి. వానాకాలం సీజన్‌లో వరి సాధారణ రకాలు క్వింటాకు రూ.1,868 కనీస మద్దతు ధర ఉండగా, గ్రేడ్‌-ఎ ధాన్యానికి రూ.1,888గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మిర్యాలగూడ మండలం యాద్‌గార్‌పల్లికి చెందిన బాలాజీ రైస్ మిల్లులో రూ.1720/-, రూ.1740/- క్వింటాలుకు చెల్లిస్తోంది. మద్దతు ధర కన్నా తక్కువ చెల్లిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ఆ మిల్లును సీజ్ చేశారు.

మిల్లర్లు చెబుతోంది ఇలా..

టాస్క్‌ఫోర్స్ చెబుతున్నదీ ఇలా ఉన్నప్పటికీ.. రైసు మిల్లర్ల యాజమాన్యాలు మరోలా చెబుతున్నాయి. తక్కువ ధర చెల్లించిన మాట వాస్తవమేనని రైసు మిల్లర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. నాణ్యత లేని బియ్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి మేం నష్టపోవాలా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు నాణ్యతను పరిశీలించకుండా రైసు మిల్లును సీజ్ చేయడాన్ని ఖండించారు. రైసు మిల్లు యాజమాన్యాలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయంటూ ప్రచారం చేయడం సరికాదంటున్నారు. మేం ధాన్యం కొనుగోళ్లకు పూర్తి సహకారం అందిస్తామని, అదేవిధంగా అధికారులు మాకు సహకరించాలని చెబుతున్నారు. అధికారులే స్వయంగా మిల్లుల్లో ప్రభుత్వ సిబ్బందిని నియమించి.. నాణ్యతను బట్టి ధరను నిర్ణయిస్తే.. ఆ ప్రకారమే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మిల్లర్లు ప్రకటించారు.

ఆగిన 3వేల ట్రాక్టర్ల ధాన్యం కొనుగోళ్లు

రైస్ మిల్లును అధికారులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ మిల్లుల యాజమాన్యాలు నిరసనకు దిగాయి. దీంతో మంగళవారం పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైస్ మిల్లుల ఎదుట ధాన్యం ట్రాక్టర్లు భారీగా బారులుదీరాయి. దాదాపు మంగళవారం ఒక్కరోజే 3వేల ట్రాక్టర్ల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని మిల్లర్స్ అసోసియేషన్ చెబుతోంది. విసిగిపోయిన రైతులు నార్కట్‌పల్లి- అద్దంకి జాతీయ రహదారిపై పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో మిర్యాలగూడ పరిధిలో అంతా గందరగోళం నెలకొంది. ఓవైపు మిల్లర్స్ యాజమాన్యాలు.. మరోవైపు రైతులు రోడ్డెక్కడంతో అధికారులకు సైతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. చివరకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్‌లు రైసు మిల్లర్స్ యాజమాన్యాలతో కలెక్టరేట్‌లో చర్చించారు. మంగళవారం నిలిచిన 3వేల ట్రాక్టర్ల ధాన్యాన్ని క్లియర్ చేసేందుకు మరో మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు.

Advertisement

Next Story