బెంగాల్ దంగల్‌లో అయిషె ఘోష్

by Shamantha N |
బెంగాల్ దంగల్‌లో అయిషె ఘోష్
X

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటి పునర్ వైభవాన్ని చాటాలనుకుంటున్న సీపీఐ(ఎం) ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. సాధారణంగా ఆ పార్టీలో యువ నాయకులకు ఎన్నికలలో పెద్దగా టికెట్లివ్వరనే అపప్రదను తొలగించుకుంటూ ఈసారి బెంగాల్‌లో ఎక్కువ మంది విద్యార్థి, యువ నాయకులనే పోటీలో నిలిపింది. వారిలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్స్ (జేఎన్‌యూఎస్‌యూ) లీడర్ అయిషె ఘోష్ తో పాటు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి నాయకులకు టికెట్లను కేటాయించింది.

అయిషె ఘోష్‌ పశ్చిమ బర్దమాన్ జిల్లాలోని జమురియా నియోజకవర్గం నుంచి పోటీలో దిగుతుండగా.. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షురాలు మీనాక్షి ముఖర్జీ నందిగ్రామ్ నుంచి బరిలో ఉంది. ఇక్కడ టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నుంచి సువేందు అధికారి పోటీలో ఉండటం గమనార్హం. ఘోష్, మీనాక్షితో పాటు మరో జేఎన్‌యూ నాయకురాలు దిపిస్త ధర్ (బల్లీ నుంచి పోటీలో ఉంది), ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య (సింగూరు నుంచి) డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సయందీప్ మిత్రా (కమర్‌హతి నుంచి), ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రెహ్మాన్ (డైమండ్ హార్బర్ నుంచి), సతరప్ ఘోష్ (కస్బ) ప్రీత (బర్దమాన్ సౌత్ అసెంబ్లీ నుంచి)లు బెంగాల్ దంగల్‌లో బరిలోకి దిగుతున్నారు. మరి ఈ యువ నాయకులు బెంగాల్‌లో ఎర్రజెండాను రెపరెపలాడిస్తారో లేదో చూడాలంటే మే 2 దాకా వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed