భారత్‌లో ఎఫ్‌సీఏ విస్తరణ ప్రణాళికలు!

by Harish |
భారత్‌లో ఎఫ్‌సీఏ విస్తరణ ప్రణాళికలు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో జీప్ బ్రాండ్ ఎస్‌యూవీలను విక్రయిస్తున్న ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్‌సీఏ) సంస్థ మంగళవారం దేశీయంగా ఉత్పత్తి విస్తరణకు సంబంధించి సుమారు రూ. 1,850 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఈ పెట్టుబడులను ముఖ్యంగా నాలుగు కొత్త జీప్ ఎస్‌యూవీల ఉత్పత్తికి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. వీటిలో త్వరలో విడుదల కానున్న కాంపాస్ మోడల్. అలాగే, మూడు వరుసల జీప్ ఎస్‌యూవీ, ఐకానిక్ జీప్ వ్రాంగ్లర్, కొత్త జనరేషన్ గ్రాండ్ చెరోకీ ఎస్‌యూవీలను స్థానికంగా అసెంబుల్ చేయనున్నారు. ఈ నాలుగు కొత్త మోడళ్లు 2022 చివరి నాటికి భారత రోడ్లపై ఉంటాయని కంపెనీ తెలిపింది. జీప్ కాంపాస్ 2021 వెర్షన్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమవగా, జనవరి 7న ఆవిష్కరించనున్నారు. లగ్జరీ 7-సీటర్ మిడ్-సైజ్ జీప్, హెచ్ 6 పేరుతో రానున్న కొత్త మోడళ్లు వచ్చే ఏడాదిలో లాంచ్ అవనున్నాయి.

తాజా పెట్టుబడులతో పాటు ఈ వారంలో లాంచ్ అవనున్న జీప్ ఎస్‌యూవీలతో మార్కెట్లో పోటీ ఇవ్వగలమని’ ఎఫ్‌సీఏ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డా. పార్థ దత్తా చెప్పారు. 2015లో భారత్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు ఎఫ్‌సీఏ సంస్థ రూ. 3,300 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు పార్థ దత్తా తెలిపారు. జీప్ బ్రాండ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ పట్ల నిబద్ధతను కొనసాగిస్తూ కొత్త ఉత్పత్తులను ప్రకటించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, గత నెలలో ఎఫ్‌సీఏ హైదరాబాద్‌లో పెట్టుబడుల గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా 2021 చివరి నాటికి కనీసం వెయ్యి ఉద్యోగాలను సృష్టించేలా కార్యకలాపాలను విస్తరించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed