రాష్ట్రానికి రెండ్రోజులు వర్ష సూచన

by Shyam |
రాష్ట్రానికి రెండ్రోజులు వర్ష సూచన
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 900మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించి ఉండగా, రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, దీంతో శుక్ర, శనివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

శుక్రవారం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులుప్రకటించారు.

గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో అత్యధికంగా 12 సెంటీమీటర్లు, గూడూరు మండలంలో 10 సెంటీమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా జనగామ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, మంచిర్యాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Advertisement

Next Story

Most Viewed