స్త్రీలను గౌరవించడం మన కర్తవ్యం..

by Shyam |
స్త్రీలను గౌరవించడం మన కర్తవ్యం..
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్ : స్త్రీకి భూ దేవికి ఉన్నంత స‌హ‌నం ఉంటుంద‌ని, అందుకే అంత ఓర్పుగా ఇంటా బయటా చక్కబెట్టుకు రాగలుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొవిడ్ సమయంలో పరీక్షల ఫలితాలు రాక ముందే ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్లి సేవలందించింది మహిళా నర్సులు, ఏఎన్ఎమ్ లేన‌ని, అలాంటి వారిని మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా గౌరవించడం మన కర్తవ్యం అని అన్నారు. ప్రపంచాన్ని అత‌లాకుత‌లం చేసిన కొవిడ్ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డంలో విశేష సేవ‌లందించిన ప‌లు రంగాల‌కు చెందిన వ్య‌క్తుల‌ను మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్స్ ఘ‌నంగా స‌త్క‌రించింది.

ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆసుపత్రుల్లో ప‌ని చేస్తున్న 30 మంది డాక్ట‌ర్లు, కాంటినెంటల్ హ‌స్పిటల్స్‌లోని 15 మంది స్టాఫ్ మెంబ‌ర్లు, ఐదుగురు పోలీసు అధికారులు, ముగ్గురు డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్లతో పాటు కొవిడ్‌తో మ‌ర‌ణించిన వారి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించిన మ‌హాప్ర‌స్థానం, ఈఎస్ఐ శ్మ‌శాన‌వాటిక‌ల సిబ్బందిని కూడా స‌త్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజ వేస్తుండడం అభినందనీయమ‌న్నారు. అయితే వారి పట్ల అఘాయిత్యాలు ఆగకపోవడం కలవరపెడుతోందిని తెలిపారు. పిల్లలకు నైతిక, మానవ సంబంధాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తేనే వీటిని అరికట్టగలమ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళ రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంది. మహిళల రక్షణ, వారి అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్స్ సీఈవో డా.రియాజ్ ఖాన్ , హాస్పిట‌ల్స్ ఫౌండ‌ర్ ప్ర‌మోట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ డా. గురు ఎన్‌.రెడ్డి , ఫౌండేష‌న్ ఫ‌ర్ ఫ్యూచ‌రిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్ క‌రుణా గోపాల్‌, జీవ‌న్‌దాన్ ఇన్‌ఛార్జి డా. జి.స్వ‌ర్ణ‌ల‌త, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ డైరెక్ట‌ర్ డా.విమ‌లా థామ‌స్‌, రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ డా.స్వ‌రాజ్య‌ల‌క్ష్మి, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్ట‌ర్ సృజ‌న త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story