వక్రమార్గంలో వంద రోజుల పని.. అంతా వారి చేతుల్లోనే..!

by Shyam |   ( Updated:2021-10-06 07:59:13.0  )
వక్రమార్గంలో వంద రోజుల పని.. అంతా వారి చేతుల్లోనే..!
X

దిశ, ఖానాపూర్: గ్రామాల్లో సంవత్సరంలో వంద రోజుల పని కల్పిస్తూ ప్రజలకు ఆర్థిక తోడ్పాటునందిస్తూ, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న ఈ.జీ.ఎస్ పథకం కొందరి అవినీతి, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అనుకున్న లక్ష్యాన్ని చేరడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో బాధ్యతలు చేపట్టిన కొందరు జూనియర్ కార్యదర్శులు నయా మోసానికి తెర తీస్తున్నారని మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

చేతికి మట్టి అంటకుండా కాజేస్తున్నారు..

గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనులను కూలీలతో చేయించేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసిన తరవాత ఆ పనుల్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేపిస్తున్నారు. ఇక్కడే కొందరు అక్రమార్కులు తమ తెలివితేటలకు పదును పెడుతూ వేలకు వేలు అక్రమంగా కొల్లగొడుతున్నారు. మేట్ల సాయంతో కూలీలతో లోపాయకారి ఒప్పందం చేసుకుంటూ ప్రజాధనం లూటీ చేస్తున్నారు. ఈజీఎస్‌లో కొత్త పుస్తకం రావాలన్నా, ఆ పుస్తకం యాక్టివేషన్ అవ్వాలన్నా, ఆ గ్రూప్‌కి పని కేటాయించాలన్నా కూడా మధ్యవర్తి లేకుండా జరగదు. నేరుగా వెళ్లినా కూడా ఏదో కుంటిసాకులు చెప్పి పని జరగనివ్వరు.

పైసా లేనిది పని జరగదని నమ్మించి, అమాయక కూలీల నుంచి ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్టు బాధిత కూలీలు ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మొదలు.. మండల స్థాయి అధికారుల సంతకాల వరకు దగ్గరుండి చేపిస్తామని నమ్మబలుకుతూ కూలీలను నట్టెట ముంచుతున్నారు. ఒక్కో గ్రూప్‌లో ఉదాహరణకి 20 మంది ఉన్నారనుకుంటే అందులో రోజు వారీగా 15 నుంచి 17 మంది మాత్రమే హాజరవుతారు. మిగిలిన మూడు నుండి ఐదుగురు సైతం హాజరైనట్లు మస్టర్‌లలో అటెండెన్స్ వేస్తారు. ఇలా దాదాపుగా ఒక్కో గ్రామానికి 15 నుండి 20 గ్రూపులు ఉంటాయి. హాజరుకాని వారందరి అమౌంట్ మధ్య వర్తుల ద్వారా చేతికి మట్టి అంటకుండా వాటాలు వేసుకుని మరీ కొట్టేస్తున్నారు.

మేమే ఎక్కువ కూలీ ఇప్పిస్తున్నాం..

తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన కూలీ రేట్ల కన్నా ఇప్పుడు అలవెన్సులు పెంచి ఎక్కువ ఇస్తోంది. ఇది సాకుగా చేసుకొని కొందరు అవినీతిపరులు మా వల్లే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. మేమే ఎక్కువ బిల్లులు కొట్టిస్తున్నాం అంటూ అమాయక కూలీల నుంచి పర్సంటేజీ రూపంలో మరికొంత వసూలు చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొందరికే పని దినాలు..!

గ్రామంలోని ఒక కుటుంబానికి వంద రోజులకు మించి పని కల్పించడం సాంకేతికంగా సాధ్యం కాదు. కానీ, కొన్ని చోట్ల తమకు అనుకూలంగా ఉన్న గ్రూప్‌లకు అదే పనిగా పని కల్పించడంలో మతలబు ఏంటని, ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఏ.పీ.ఓ సునీత గారిని వివరణ కోరగా అలాంటి అవకాశం లేదన్నారు. ఏ రకంగా అలా చేస్తున్నారో కార్యదర్శులకే తెలియాలని, వారిదే పూర్తి బాధ్యత అన్నారు. మస్టర్లలో చదువుకున్న వారు ఆరోజు పనికి హాజరైతే సంతకం పెడతారు. కానీ లోపాయకారి ఒప్పందం మూలంగా వారి మస్టర్లలో వేలి ముద్రలే ఉండటం గమనార్హం.

జూనియర్..సీనియర్లను మించాడు..

ఖానాపుర్ మండలానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి చేతివాటంలో రాటుదేలినట్లు మండలంలో చర్చ జరుగుతోంది. అతనిపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయని, అయినప్పటికీ అందరినీ మేనేజ్ చేసుకుంటూ వక్రమార్గంలో నిధులు వసూలు చేస్తున్నాడని సాక్ష్యత్తు మండల కార్యాలయంలోనే అతగాడి చేతివాటంపై చర్చ జరుగుతోంది. బర్త్ సర్టిఫికెట్ మొదలు.. డెత్ సర్టిఫికెట్ వరకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి జనాలను దోచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మరణించిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల నుండి భేరాలాడి చివరికి రూ.1500 తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఆధారాలు బయటపడ్డాయి. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉచిత సేవలు అందించాల్సిన ఉద్యోగి ఈ విధంగా అక్రమార్జనకు తెర లేపడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది.

కొరవడిన అధికారుల నిఘా..

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందించాల్సిన సేవలపై అధికారుల నిఘా కొరవడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల కార్యాలయాల్లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు సైతం పైసా లేనిదే పని చేయరన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ఈ.జీ.ఎస్ పుస్తకం యాక్టివేషన్‌కి రూ.100 తీసుకుంటున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఉపాధి హామీ పనుల్లో పనులు కల్పించడం మొదలు కార్యాలయంలో మస్టర్లు అందించడం వరకు జరుగుతున్న అక్రమాలపై సరైన పర్యవేక్షణ జరగడం లేదు. ఈ.జీ.ఎస్ పనుల్లో ఒక గ్రామంలోనే దాదాపు లక్ష రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో మండల వ్యాప్తంగా ఉన్న మొత్తం 20 గ్రామాల్లో ఎంత అవినీతి జరిగి ఉంటుందోనని మండల ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్రమార్కులపై సంబంధిత అధికారుల ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి నెలకొందని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు విచారణ చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story