‘ధరణి’లో ట్విస్ట్.. ఈటల కేసుతో వెలుగులోకి సంచలన విషయాలు..

by Anukaran |   ( Updated:2021-12-13 23:14:36.0  )
‘ధరణి’లో ట్విస్ట్.. ఈటల కేసుతో వెలుగులోకి సంచలన విషయాలు..
X

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. 70 ఎకరాలు కబ్జా చేశారంటూ అధికారులు లెక్క తేల్చారు. అయితే ఈటల జమున వాదనలో మరో కోణం బయటపడింది. భూమి రికార్డుల్లో ఒక ఏడాది ప్రభుత్వ, మరో ఏడాది పట్టా.. కొంత కాలానికి సీలింగ్.. ఇలా ఏడాదికేడాది మారుతూ వచ్చింది. ప్రభుత్వ భూములు కొన్నవారిది తప్పయితే వాటిని రిజిస్ట్రేషన్ చేసినవారు, రికార్డులు మార్చిన వారిది తప్పుకదా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి రిజిస్ట్రేషన్లు వేలల్లోనే జరిగాయని, అవన్నీ బయటపెడితే బాగుంటుందని భూ బాధితులు అంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మెదక్​జిల్లా అచ్చంపేట సర్వే నం.130 అసైన్డ్​భూమి. అందులో అక్రమంగా 2019 మార్చి 25న డాక్యుమెంట్​నం. 1590/2019 ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని జమున హ్యాచరిస్‌పై అభియోగం. అలాగే రామారావుకు టైటిల్​లేకపోయినా జమున హ్యాచరీస్ వారు కొనుగోలు చేశారు. 2007లోనే సదరు భూమిని ప్రొహిబిటెడ్​ప్రాపర్టీస్​లో నమోదు చేశారు. దాంతో రిజిస్ట్రేషన్ అక్రమం. నిజమే కానీ.. రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. స్టాంప్స్ అండ్​రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు, అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఎంత వరకు ఉన్నదో కూడా వెలుగులోకి వస్తే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒక్క ఈటల వ్యవహారంలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయా? మరే ఇతర రాజకీయ, అధికార, సినీ, వాణిజ్య వర్గ ప్రముఖుల్లో అక్రమ లావాదేవీలు చోటు చేసుకోలేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమ డాక్యుమెంట్ల లెక్క తీస్తే వేలల్లోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

మెదక్​జిల్లాతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మేడ్చల్​జిల్లాల్లో అసైన్డ్​భూముల క్రయ విక్రయాలు వేలల్లో చోటు చేసుకున్నాయని రికార్డులే చెబుతున్నాయి. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు కొనుగోలు చేసినవీ ఉన్నాయి. అంతే కాదు.. వాటిని లేఅవుట్లుగా చేసి ప్లాట్ల దందా కూడా నడిపారు. ఈటల వ్యవహారంలోని దూకుడు మిగతా అన్నింటిపైనా దర్యాప్తు చేస్తే రూ.వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వ ఖాతాలో చేరే అవకాశాలు ఉన్నాయి. అసైన్డ్​భూములను కొనుగోలు చట్టబద్ధంగా నేరమే. దీని ప్రకారం సేల్ డీడ్​చేసిన సబ్​రిజిస్ట్రార్లు, మ్యుటేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లు కూడా భాగస్వాములే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్, సీలింగ్, ప్రభుత్వ భూముల క్రయ విక్రయాలపై చర్యలు తీసుకుంటే ఎంత మంది సబ్​రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు సస్పెన్షన్ కు గురి కావాల్సి వస్తుందోనన్న చర్య రెవెన్యూ వర్గాల్లో సాగుతోంది.

సర్కారీ.. పట్టా.. సర్కారీ

2017లో భూరికార్డుల ప్రక్షాళన చేశారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. కానీ ఆ ప్రక్షాళన కూడా సరైంది కాదని ధరణి పోర్టల్​చెబుతోంది. ఎవరూ ట్యాంపరింగ్​చేయలేని డిజిటల్​పాసు పుస్తకాలు జారీ చేశారు. కానీ వాటిలోని వివరాలు, డేటా కూడా తప్పేనంటూ కొత్త ధరణి అంటున్నది. మూడేండ్ల క్రితం అధికారులు ప్రకటించిన పట్టా భూములను ఇప్పుడు సర్కారీగా పేర్కొంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. సేత్వార్​ప్రకారం మీ భూమి సర్కారీదేనంటూ తెగేసి చెబుతున్నారు. కానీ ఆ తర్వాత పహాణీల్లో పట్టాగా మారిన, మార్చిన ఉదంతాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈటల వ్యవహారంలోనూ అదే చోటు చేసుకున్నట్లు అర్థమవుతున్నది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఖాతాల్లో పట్టాగా రికార్డయిన వాటిని సర్కారీ అంటూ పీఓబీలో నమోదు చేశారు.

దాదాపు 60 ఏండ్ల పాటు పట్టాగా రికార్డుల్లో రాసిన వీఆర్వో, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధరణి పోర్టల్ బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి నుంచే సర్కారీగా రికార్డుల్లో నమోదు చేసి ఉంటే క్రయ విక్రయాలకు ఆస్కారం ఉండేది కాదు. కొనేవారు కూడా రికార్డులను చూసి వెనక్కి తగ్గే వారు. రికార్డుల ప్రక్షాళన తర్వాత రిజిస్ట్రేషన్ కు ముందు మీసేవా కేంద్రం ద్వారా జారీ చేసిన పహాణీల్లోనూ పట్టా భూమిగా రికార్డయ్యాయి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, కొత్త పాసు పుస్తకాల జారీ కొనసాగాయి. కనీసం అప్పుడైనా ఆ భూములు సర్కారీవైతే రికార్డుల ప్రక్షాళనలో ఎందుకు తేల్చలేదని మండిపడుతున్నారు. సేత్వార్, ఖాస్రా పహాణీలను యథాతథంగా కొనసాగించకుండా నేచర్​ఆఫ్ ల్యాండ్​కాలమ్​లో దిద్దుబాట్లు చేసిన పట్వారీలు మొదలుకొని వాటికి క్లియరెన్స్ ఇచ్చిన కలెక్టర్ల వరకు బాధ్యులను చేయాలి. అది వదిలేసి డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటం విడ్డూరంగా ఉంది.

మాకేం సంబంధం?

ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా సవరణకు పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అందులో సేత్వార్​మొదలుకొని భూ రికార్డుల ప్రక్షాళన వరకు నేచర్​ఆఫ్ ల్యాండ్​ఎలా మారిందో నివేదిక సమర్పించాలని చీఫ్​సెక్రటరీ అధికారులను ఆదేశించారు. అయితే కొందరు తహసీల్దార్లు మాత్రం అది తమకేం పట్టనట్లు, తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. సేత్వార్‌లో సర్కారీ అని ఉంది.. అదే తుది నివేదిక అంటూ పీఓబీ జాబితా నుంచి తొలగించాలంటూ వచ్చే అర్జీలను పలుమార్లు తిరస్కరణకు గురయ్యేటట్లుగా చేస్తున్నారు. కనీసం ఏ సంవత్సరం నుంచి సర్కారీ నుంచి పట్టాగా మారిందన్న విషయాన్ని నివేదికలో పేర్కొనడం లేదు. 60 ఏండ్లకు పైగా పట్టాగా నమోదైన రికార్డును ఏకపక్షంగా సర్కారీ అంటే ఆ రైతుకు ఎంత నష్టం? ఎంత కష్టం? అని మానవీయ కోణంలో ఆలోచించాల్సిన తహసీల్దార్లు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఎవరో అధికారి, ఉద్యోగి తప్పిదానికి ఆ తర్వాత కొనుగోలు చేసిన రైతును కష్టపెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు.. కానీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్​సూచనల మేరకు రిపోర్టులు సమర్పించడం ద్వారా ఎన్నేండ్లుగా పట్టాగా రికార్డయ్యిందన్న విషయం స్పష్టమవుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత చోటు చేసుకున్న క్రయ విక్రయాలకు బాధ్యులెవరు? అన్ని రికార్డులు సరిగ్గా ఉన్నందు వల్లే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కొనుగోలు చేసిన వారికి అన్యాయం ఎలా చేస్తారని బాధితులు మండిపడుతున్నారు. కనీసం భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత జరిగిన క్రయ విక్రయాలు, మ్యుటేషన్లకు బాధ్యులైన సబ్​రిజిస్ట్రార్లను, తహసీల్దార్లను సస్పెండ్​చేయాలని డిమాండ్​చేస్తున్నారు.

ఇదో భూ రికార్డుల వింత

యాదాద్రి జిల్లా దేవులమ్మ నాగరంలో సర్వే నం.623 లో 1965 నుంచి 2014 వరకు పహాణీలు పరిశీలిస్తే.. 1965లో భూమి స్వభావము దస్తూ దర్గా, 1970-71 లో పట్టా.. 1976-77లో దస్తూ దర్గా.. 1990-91 లో కూడా దాస్తుదర్గా.. 1999-2000లో పట్టా.. 2005-06, 2010-11, 2013-14 వరకు పట్టా అని రికార్డులు చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అయ్యాయి. కాకపోతే కొత్త పాసు పుస్తకాలు జారీ కాలేదు. లావాదేవీలు మొదట వరకాంతం అచ్చి రెడ్డి పేరు తర్వాత తన కుమారుడు పాపిరెడ్డి పేరు వచ్చింది. అతడి నుంచి నలుగురు 1976- 77 లో కొన్నారు. వారి నుంచి 1999 -2000 లో వారి కుమారులకు.. మళ్లీ 2001-02లో ఇందులో ఒక పట్టాదారు అమ్మితే మరొకరు కొనుగోలు చేశారు. 2013-14 లో ప్రభుత్య పథకాలు కూడా వచ్చాయి.

ఇప్పుడు కొత్తగా వక్ఫ్ భూమి అని చెప్పి ప్రొహిబిషన్ కింద పెట్టారు. మరి 1965 నుంచి 2017 వరకు క్రయ విక్రయాలు ఎందుకు జరిపారు? కొనుగోలు చేసిన రైతును శిక్షిస్తున్నారు. కానీ ఇన్నిసార్లు రికార్డులు మార్చిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇలా నల్లగొండ, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్​, రంగారెడ్డి, వరంగల్​, కరీంనగర్​తదితర జిల్లాల్లో అనేక భూముల నేచర్ ఆఫ్ ల్యాండ్​ను ఇష్టారాజ్యంగా మార్చారు. 60 ఏండ్ల రెవెన్యూ రికార్డులను పరిశీలించిన కొనుగోలు చేసినా అకస్మాత్తుగా సర్కారీ అంటూ పీఓబీలో చేర్చడం పట్ల వేలాది మంది రైతు కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.

రిజిస్ట్రేషన్ ఎలా అయింది?

అచ్చంపేట భూముల వ్యవహారంపై ఈటల జమున క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్​మాటల ప్రకారం ధరణిలో నమోదైన రికార్డులు ఫైనల్. అలాంటి ధరణిలో ఎంట్రీ చేసిన భూములనే తాము కొన్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు అవి తప్పు అంటే ధరణి వల్ల ఉపయోగం లేదా.. ధరణిలో ఉన్న భూములన్నీ ఫేకేనా అని ప్రశ్నించారు. సర్వే నెంబర్ 81లో మాకు ఉన్నది 5.30 ఎకరాలే. సర్వే నం.130 లో మూడు ఎకరాలు ఉంది. తాము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. 2018లో తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. అసైన్డ్, సీలింగ్​భూములైతే రిజిస్ట్రేషన్ ఎలా అయ్యిందన్న ప్రశ్న రెవెన్యూ వర్గాల్లోనూ తలెత్తింది. ఇప్పుడా రిజిస్ట్రేషన్ చేసిన సబ్​రిజిస్ట్రార్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story