మార్కెట్లో ఐఆర్‌సీటీసీ హవా!

by Shyam |   ( Updated:2020-02-24 04:34:28.0  )
మార్కెట్లో ఐఆర్‌సీటీసీ హవా!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే చాలామంది భయపడతారు. కానీ, కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ముందుకు వస్తారు. అయితే, వీరిలో కేవలం 90 శాతంమంది మాత్రమే లాభాలను చూడగలుగుతారు. మిగిలినవారు నష్టాలను మూటగట్టుకుని వెనుదిరుగుతారు. స్టాక్ మార్కెట్లో ఎంత వేగంగా లాభాలను చూడగలుగుతామో, అంతే వేగంగా నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

స్టాక్ మార్కెట్లో రాణించాలంటే సరైన సమయంలో సరైన స్టాక్స్‌ను ఎంచుకోవాలి. దానికి మార్కెట్‌పై పట్టు ఉండాలి. పరిణామాలను గమనిస్తుండాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిణామాలను పరిశీలిస్తూ ఉంటేనే ఎలాంటి కంపెనీల షేర్లను కొంటే లాభాలొస్తాయో తెలుస్తుంది. తాజాగా ఊహించనిస్థాయిలో సుమారు 150 శాతానికి మించి పెరిగిన స్టాక్ ఒకటి మార్కెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అదే ఇండియన్ రైల్వేస్ వారి ఐఆర్‌సీటీసీ షేర్. గతేడాది అక్టోబర్‌లో ఐఆర్‌సీటీసీ ఐపీవో ప్రకటించింది. ఇష్యూ ధరగా అప్పుడు రూ.320గా నిర్ణయించారు. మార్కెట్ లిస్టింగ్‌లోకి వచ్చిన నాటి నుంచే ఐఆర్‌సీటీసీ రికార్డులను తిరగరాసింది. అక్టోబర్ నెలలో ఐఆర్‌సీటీసీ షేర్ లిస్టైంది. లిస్టైన తర్వాత ఐఆర్‌సీటీసీ షేర్ ధర రూ. 320 నుంచి 179 శాతం పెరిగి ఏకంగా రూ. 644 కు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఐఆర్‌సీటీసీ షేర్ ధర వేగంగా పయనించడం మొదలుపెట్టింది.

గత వారం 19న ఐఆర్‌సీటీసీ షేర్ ధర ఏకంగా 9.6 శాతం పెరిగి రూ. 1869కి చేరింది. మరుసటి రోజు 4.37 శాతం పెరిగి రూ. 1,912 వద్ద నిలిచింది. నాలుగు నెలల క్రితం వరకూ ఐఆర్‌సీటీసీ షేర్ ధర రూ. 320 గా ఉన్నది కాస్త ఇప్పుడు రూ. 2,000 దగ్గరకు వచ్చేసింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ షేర్ ధర రూ. 1928 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల ఐఆర్‌సీటీసీ వారణాసి-ఇండోర్ మధ్య కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. ఐఆర్‌సీటీసీ షేర్ ధర అమాంతం పెరగడానికి కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, అంతర్జాతీయంగా కరోనా వైరస్ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడటంతో ఐఆర్‌సీటీసీ షేర్ ధర కాస్త నెమ్మదించింది. దీంతో ఐఆర్‌సీటీసీ మార్కెట్ మూలధనం కూడా బీఎస్ఈలో రూ. 30,273 కోట్లకు క్షీణించింది. ఈ ఏడాదిలో ఐఆర్‌సీటీసీ స్టాక్ ధర సుమారు 103.82 శాతం పెరిగింది. కేవలం ఒక నెల వ్యవధిలో ఐఆర్‌సీటీసీ షేర్ ధర 83 శాతం పెరిగింది. అయితే, గత వారం మార్కెట్ ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. చైనా కాకుండా ఇతర దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో అది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. దీంతో ఐఆర్‌సీటీసీ షేర్ ధర రూ. 2000కు కొన్ని అడుగుల దూరంలో నిలిచింది.

Read also..

మొతెరాలో ‘నమో’స్తే ట్రంప్

Advertisement

Next Story

Most Viewed