ఎయిర్ ఇండియాకు సలాం!

by Shamantha N |
Air India
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయి. కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళా.. దేశదేశాలకు సహాయక సేవలందిస్తుండటంపై పలుదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అనేక దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా మన ఎయిర్ ఇండియా సేవకు మురిసిపోయి మీ కమిట్ మెంట్ కు గర్వపడుతున్నామని పొగిడింది. ప్రస్తుతం నెలకొన్న భయానక వాతావరణంలో.. దాయాది దేశం తన గగనతలంలోకి మన ఎయిర్ ఇండియాను స్వాగతించడమే కాదు… పొగడ్తలతో ముంచెత్తింది.. తన వంతు సహాయాన్ని అందించింది.

కరోనా మహమ్మారి విజృంభన తర్వాత మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులను సొంత దేశానికి తరలించేందుకు.. అలాగే రిలీఫ్ మెటీరియల్ అందజేసేందుకు ఎయిర్ ఇండియా విస్తృత సేవలు అందిస్తున్నది. లాక్ డౌన్ తో ఇక్కడే చిక్కుకుపోయిన జర్మన్లను వారి దేశానికి తరలించేందుకు ప్రయాణం కట్టింది. ఎయిర్ ఇండియా రెండు ఫ్లైట్ లు ఈ నెల 2న ముంబై నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు బయలుదేరాయి.

ఈ ప్రయాణంలో భాగంగా పొరుగున ఉన్న పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లేటప్పుడు ఆ దేశపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ను సంప్రదించేందుకు ప్రయత్నించగా కుదరలేదు. ఫ్రీక్వెన్సీ చేంజ్ చేశాక పాక్ ఏటీసీ అందుబాటులోకి వచ్చింది. ఆశ్చర్యంగా ఫోన్ లో అస్సలాము అలైకుమ్ అని తెలుపుతూ.. సహాయక సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లకు కరాచీ స్వాగతం పలుకుతోందని చెప్పారు. ఫ్రాంక్ఫర్ట్ కు సహాయ సేవల పైన వెళ్తున్నారా? అని ప్రశ్నించగా మన పైలట్ ఔనని సమాధానమిచ్చాడు. ఇటువంటి విపత్తు సందర్భంలో మీరు విమాన సేవలు అందించడం గర్వంగా ఉంది. మీకు మంచి జరుగుగాక అని ప్రార్థించారని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. అందుకు థాంక్యూ సోమచ్ అని మన కెప్టెన్ బదులిచ్చారు. అంతేకాదు, పాక్ అధికారులు కరాచీ సమీపంగా ఎగిరేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు అనుమతివ్వడంతో దాదాపు 15 నిమిషాల సమయం ఆదా అయింది.

పాకిస్తాన్ సహాయం అక్కడే ఆగిపోలేదు. పక్కనే ఉన్న ఇరాన్ అధికారులు మన ఎయిర్ ఇండియాకు అందుబాటులోకి రాలేదు. అప్పుడు కూడా పాక్ స్వయంగా ఇరాన్ ను సంప్రదించి ఎయిర్ ఇండియా సేవలను వివరించింది. దీంతో ఇరాన్ అందుబాటులోకి వచ్చి… ఎయిర్ స్పేస్ లో సమయం వృధా కానివ్వకుండా మన విమానాలకు షార్ట్ రూట్ ను చూపించారు. దీంతో మన విమానాలు అనుకున్న సమయం కంటే 40 నిమిషాలు ముందుగానే ఫ్రాంక్ఫర్ట్ కు చేరుకున్నాయి.

కరోనా లాక్ డౌన్ తో మన దేశం లో చిక్కుకుపోయిన జర్మనీ, ఫ్రెంచ్, ఐరిష్, కెనడియన్ లను తమ దేశాలకు తరలించాల్సిందిగా ఆ దేశాల ఎంబసీలు విజ్ఞప్తి చేశాయి. వారిని ఆయా దేశాలకు పంపించేందుకు ఎయిర్ ఇండియా 18 చార్టర్ ఫ్లైట్లను కేటాయించింది. ఈ సేవలకుగాను పలు దేశాలు ఎయిర్ ఇండియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారవయి. పాక్ ఈ జాబితాలో తాజాగా చేరింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలకు అనుగుణంగా చైనా నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ఎయిర్ ఇండియా సేవలందిస్తున్నది. ఈ సేవలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి.

ఆపత్కాలంలో ఇంతటి సేవలందిస్తున్న ఎయిర్ ఇండియాను మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ సంస్థను వేలం వేసేందుకు విఫల ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనైనా వేలం వేయాలన్న ఆలోచనలోనే కేంద్రం ఉండటం గమనార్హం.

Tags: Air india, praises, international, pakistan, proud of you, germany, Frankfurt

Advertisement

Next Story

Most Viewed