కౌంటింగ్ కేంద్రంలో కావాలనే గొడవలా..? ఆ బ్యాలెట్ బాక్సుల తాళాలు ఎందుకు పగలగొట్టారు..

by Shyam |
కౌంటింగ్ కేంద్రంలో కావాలనే గొడవలా..? ఆ బ్యాలెట్ బాక్సుల తాళాలు ఎందుకు పగలగొట్టారు..
X

దిశ ప్రతినిధిని, నల్లగొండ : నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది..? ఇండిపెండెంట్ల అభ్యర్థులకు సంబంధించిన ఏజంట్లుగా వెళ్లిన వారు ఎవరు..? అసలు ఈ గొడవల వెనుక ఎవరున్నారు..?. అసలు కౌంటింగ్ కేంద్రంలో అధికార యంత్రాంగం ఏం చేస్తోంది..? అనే అనుమానాలు ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లోనే కాదు. అటు సాధారణ ప్రజానీకంలో సైతం టెన్షన్‌ పెంచుతోంది. వాస్తవానికి కౌంటింగ్ కేంద్రంలో పరిస్థితి చూస్తే.. ఆ ఊహాగానాలకు ఊపిరిపోసినట్టు అవుతోంది. నల్లగొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రంలోని పరిస్థితిపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

ఆ బాక్సుల తాళాలు ఏమయ్యాయి..?

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును అర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యింది. కానీ మధ్యాహ్నాం 12 గంటల సమయానికే కౌంటింగ్ కేంద్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కౌంటింగ్ కేంద్రంలోని 8 హాళ్లలో, ఆరో హాల్‌లో 8 బ్యాలెట్ బాక్సుల తాళాలకు సీల్ లేకుండా కన్పించాయి. అదే సమయంలో సంబంధిత బాక్సుల తాళాలు మిస్ అయ్యాయంటూ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఆ బాక్సుల తాళాలను పగులగొట్టారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు అలా చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో సిబ్బందికి, ఏజంట్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫలితంగా పోలీసులు పలువురు ఏజంట్లను బలవంతంగా హాల్ నుంచి బయటకు పంపారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది.

రాత్రి సమయంలో గొడవలు..?

ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు మూడు రోజులకు పైగానే సాగనుంది. దీంతో ఓట్ల లెక్కింపు కోసం షిప్టుల వారీగా సిబ్బందిని నియమించారు. నిరంతరాయంగా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. రాత్రి సమయంలోనూ కౌంటింగ్‌ను ఆపబోరు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఓ అభ్యర్థి తరపున కౌంటింగ్ కేంద్రంలో గొడవలు సృష్టించేందుకు ప్లాన్ చేశారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఇండిపెండెంట్ల ఏజంట్ల తరపున ఇతరులు..

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక్కో టేబుల్‌కు ఒక్కో అభ్యర్థి తరపున ఒక్కో ఏజెంటు ఉంటారు. అయితే నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 71మంది అభ్యర్థులు పోటీలో నిలవడం.. అందులో ఎక్కువ శాతం మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీకి దిగారు. అయితే కౌంటింగ్ ప్రక్రియలో చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున గొడవలు సృష్టించాలని చూస్తోన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు వెళ్లారన్న సమాచారం లేకపోలేదు. సొంత పార్టీ ఏజెంట్లే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున వెళ్లిన ఏజంట్లు సైతం ఏ చిన్నపాటి గొడవ జరిగినా.. ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మరికొంత మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆరోపిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed