స్ఫూర్తి ప్రదాత ‘జ్యోతి

by Sridhar Babu |
Inspirational women jyoti distributing masks
X

దిశ, కరీంనగర్:

ఓ సారి కౌన్సిలర్‌గా, మూడు సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌గా, జాతీయ క్రీడాకారిణిగా, టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఆమె. కోరలు చాచి మనషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆమె. రాజకీయ, క్రీడా క్షేత్రాలలోని నాటి స్ఫర్తిని నేడూ ప్రదర్శిస్తున్నారు. పదవులుంటేనే గుర్తింపు అన్నట్టుగా తయారైన నేటి సమాజంలో గుర్తింపు కన్నా బాధ్యతే మిన్న అన్న రీతిలో సేవాభావంతో ముందుకు సాగుతున్నారు.

ఆ స్ఫూర్తి ప్రదాత కరీంనగర్‌కు చెందిన వరాల జ్యోతి. రెండు దశాబ్దాల కిందట కౌన్సిలర్‌గా బల్దియాలో ప్రాతినిథ్యం వహించారు. అప్పుడే మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారిలో నవ చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా మూడుసార్లు గెల్చిన జ్యోతి సభ్యుల అభ్యున్నతే ధ్యేయంగా పని చేశారు. టీడీపీలో క్రియాశీలక రాజకీయాల్లో పాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఉన్న మక్కువతో కబడ్డీ నేషనల్ ప్లేయర్‌గా, అథ్లెటిక్స్ విభాగంలో జావెలిన్ త్రో‌లో గోల్డ్ మెడల్ సాధించారు. కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న వరాల జ్యోతి ఇటీవలే బీజేపీలో చేరారు. వెటరన్ అథ్లెటిక్స్ జాతీయ స్థాయిలో జరిగే స్పోర్ట్స్ మీట్‌లోనూ ఆమె పాల్గొంటున్నారు. నాటి సేవాభావం నేటికీ ఆమెలో కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కరీంనగర్‌ను తాకగానే తనవంతు బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. మాస్క్‌లు ధరించి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తున్న ప్రచారాన్ని గమనించిన జ్యోతి తనవంతుగా సమాజానికి సేవ చేయలని భావించారు. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా కరోనా కట్టడికి తమవంతుగా సాయం చేయాలని పిలుపునివ్వడంతో వరాల జ్యోతి అందరిలా ఆహారం అందించాలని అనుకోలేదు.తనకుకుట్టుపై ఉన్న పట్టుతోమాస్కులను తయారు చేయాలనుకున్నారు. మార్కెట్‌లో విక్రయించిన ఓ మాస్క్‌ను పరిశీలించి అదే మోడల్‌లో మాస్కులను స్టిచ్చింగ్ చేసి వితరణ చేస్తున్నారు. క్లాత్ కూడా ఆమె కొనుగోలు చేసి మాస్కులు కుట్టి నడుచుకుంటూ వెళ్తున్న సాధారణ వ్యక్తులకు అందిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులకూ మాస్కులను పంపిణీ చేస్తున్న వరాల జ్యోతి స్ఫూర్తితో మరో ఆరుగురు మహిళలు మాస్కులు తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. అందరూ కలిసి కరోనా పూర్తిగా తగ్గే వరకూ మాస్కులను ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మాస్కు లేకుండా తిరుగుతున్న నిరుపేదలకు వీటిని అందించే లక్ష్యంగా పెట్టుకున్నారు జ్యోతి.

పేదలకు మాస్కుల పంపిణీ లక్ష్యం

కరోనా కారణంగా మార్కెట్లో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. పేదలకు అందుబాటు ధరలో మాస్కులు దొరికే అవకాశం లేదు. వ్యాధి సోకకుండా పేదింటి వారు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి లేదని గమనించా. వారి కోసం ఏదైనా సాయం చేయాలని మాస్కులు పంపిణీ చేయాలనుకున్నా. కూలీలకు, పేదలకు ఆహారం అందించేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ, పేదలు కరోనా బారిన పడకుండా ఉండాలంటే మాస్కులు అవసరమని గుర్తించా. ముందుగా స్వయంగానే మాస్కులు కుట్టడం స్టార్ట్ చేశా. నన్ను చూసి మరింతమంది ముందుకు వచ్చారు. మేమంతా ఇళ్లకే పరిమితమై రెడీ చేసిన మాస్కులు పేదలకు పంచుతున్నాం.

– వరాల జ్యోతి

Tags: mask, distribution, leader jyoti, covid 19 affect, poor people

Advertisement

Next Story