‘అవరోధాలున్నా.. టీకా సమానత్వానికి ప్రయత్నించాం’

by Shamantha N |
‘అవరోధాలున్నా.. టీకా సమానత్వానికి ప్రయత్నించాం’
X

వాషింగ్టన్: పేద, ధనిక తారతమ్యాలు లేకుండా ప్రపంచదేశాలన్నీ టీకాను అందుకోవాలన్న మాటకు భారత్ కట్టుబడిందని, ఎన్నో అవరోధాలున్నా, పరిమిత వనరులతోనే ఇచ్చి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. 80కిపైగా దేశాలకు కరోనా టీకాలను సరఫరా చేసిందని ఐక్యరాజ్య సమితిలో భారత్ వెల్లడించింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో సమాచార కమిటీ 43వ సెషన్‌లో ఇండియా ప్రతినిధి ఏ అమర్‌నాథ్ ఈ మేరకు తెలియజేశారు. అంతర్జాతీయ సంస్థలు, టీకా ఉత్పత్తిదారులు, ఇతర సభ్యదేశాలూ ఇందుకోసం పాటుపడాలని, వారి ప్రయత్నాలను వెలుగులోకి తేవాలని యూఎన్ గ్లోబల్ కమ్యూనికేషన్ శాఖను అమర్‌నాథ్ కోరారు.

భారత్ ఇప్పటి వరకు 80కిపైగా దేశాలకు టీకాను అందించిందని, 150కిపైగా దేశాలకు ప్రాణాధార ఔషధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేసిందని వివరించారు. అందరూ ఈ మహమ్మారి నుంచి బయటపడేంత వరకూ ఎవరూ సురక్షితులు కాదనే తమ నమ్మకానికి అనుగుణంగా పనిచేశామని తెలిపారు. టీకా దౌత్యంలో భాగంగా భారత్ పొరుగు దేశాలతోపాటు లాటిన్, ఆఫ్రికాదేశాల వరకూ సహాయ హస్తం అందించింది. ప్రపంచవ్యాప్తంగా 95దేశాలకు ఆపన్నహస్తం అందించడానికి ఏర్పాటు చేసిన కొవాక్స్‌కు ప్రధాన వనరుగా మనదేశమే ఉండటం గమనార్హం.

Advertisement

Next Story