ఇక్కడే మందుల్లేవ్.. సెర్బియాకు ఎగుమతా ?

by Shamantha N |   ( Updated:2020-04-01 07:05:22.0  )
export
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ముందుండి పోరాడుతున్న వైద్యులకు రక్షణ పరికరాల కొరత ఉండగా భారత్.. దాదాపు 90 టన్నుల సేఫ్టీ గేర్, వైద్య పరికరాలను సెర్బియాకు పంపించింది. కరోనా బాధిత దేశాలకు మద్దతుగా నిలుస్తున్న యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్ డీపీ) సంస్థ సెర్బియా దేశపు విభాగం.. దీనికి సంబంధించిన ట్వీట్ చేసింది. మన దేశంలోనే వైద్యులకు రక్షణ పరికరాల కొరతుండగా మరో దేశానికి వాటిని ఎగుమతి చేయాల్సిన అవసరం ఏముందని? ఎందుకు పంపించారు? అని సామాజిక కార్యకర్తలు, విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. హెల్త్ మినిస్ట్రీ మాత్రం తమకు ఆ సమాచారం లేదని తోసిపుచ్చింది.

90 టన్నుల మెడికల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లను ఇండియా నుంచి మోసుకొచ్చిన బోయింగ్ 747 విమానం బెల్గ్రేడ్ లో ఈ రోజు ల్యాండ్ అయిందని సెర్బియా లోని యూఎన్ డీపీ మార్చి 29న ట్వీట్ చేసింది. సెర్బియా రెండోసారి భారత్ నుంచి ఎక్విప్మెంట్ లను స్వీకరిస్తున్నట్టు పేర్కొంది. దీనికంటే ముందు 30 టన్నుల పరికరాలను భారత్.. సెర్బియాకు పంపినట్లు తెలిసింది. మార్చి 29న 35 లక్షల స్టెరైల్ సర్జికల్ గ్లౌజులు సహా ఇతర ఉత్పత్తులను సెర్బియాకు పంపించినట్టు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, 90 టన్నుల రక్షణ పరికరాల్లో 50 టన్నుల సర్జికల్ గ్లౌజులు సహా మాస్కులు, వైద్యులు రక్షణ కోసం ధరించే ఉత్పత్తులు ఉన్నాట్టు సమాచారం. కాగా, దీనిపై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ లవ్ కుమార్ స్పందిస్తూ.. ఇతర దేశాల నుంచి కావలసిన పరికరాలను సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కానీ, సెర్బియాకు సంబంధించిన వివరాలు మాత్రం తమకు తెలియదని అన్నారు.

దేశవ్యాప్తంగా… రక్షణ పరికరాలు లేక కరోనా బాధితులకు చికిత్స అందించిన దాదాపు 100 మంది వైద్యులు క్వారంటైన్ లో ఉన్నారు. పలువురు డాక్టర్లు కరోనా బారినా పడ్డారు. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తగిన రక్షణ పరికరాలు అందించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల పరికరాలు లేక…. హెల్మెట్లు, రెయిన్ కోట్లు వాడుతున్న దుస్థితి ఉన్నది. అయితే ఈ కొరతను అధిగమించేందుకు దక్షిణ కొరియా, చైనా నుంచి రక్షణ పరికరాలు దిగుమతికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం తెలపడం కాస్త ఊరటనైతే ఇచ్చింది. కానీ, ఇప్పుడు మన దేశం సుమారు 120 టన్నుల రక్షణ పరికరాలను సెర్బియా దేశానికి ఎగుమతి చేసిన వార్త కలకలం సృష్టిస్తున్నది.


Tags: Coronavirus, Serbia, medical equipment, safety gear, export, crunch, doctors

Advertisement

Next Story