- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమజ్జీవుల పోరులో టీమిండియా ఘన విజయం
దిశ, స్పోర్ట్స్ : ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లు బోరుగా జరిగాయి. ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిస్తే.. మరో మ్యాచ్ ఇండియా గెలుస్తూ చివరి వరకు వచ్చాయి. ఏ మ్యాచ్‌లోనూ ధనాధన్ పరుగులు లేవు. ఏదో గెలుస్తూ వస్తున్నాం అంటూ ఇరు జట్లు అనుకున్నాయి. కానీ ఐదో టీ20లో అభిమానుల పరుగుల దాహాన్ని ఇరు జట్లు తీర్చేశాయి. మొదట టీమ్ ఇండియా పరుగుల సునామీ సృష్టించింది. మేమూ తక్కువ ఏం కాదంటూ ఇంగ్లాండ్ కూడా పరుగుల వరద పారించింది. కానీ సరైన సమయంలో వారిని కట్టడి చేసి మ్యాచ్ గెలవడమే కాకుండా.. పేటీఎం టీ20 సిరీస్‌నూ 3-2తో భారత్ జట్టు గెలుచుకుంది.
పేటీఎం టీ20 సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన చివరిదైన 5వ టీ20లో టీమ్ ఇండియా 36 పరుగులతో విజయం సాధించింది. ఇండియా నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టును భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 2వ బంతికే ప్రమాదకరమైన జేసన్ రాయ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ పతనం ప్రారంభమైందని అందరూ భావించారు. కానీ ఫామ్‌లో ఉన్న జాస్ బట్లర్, వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ భారత బౌలర్లపై విరుచుకపడ్డారు. ప్రతీ ఓవర్‌లో సిక్సు, ఫోర్లు కొడుతూ రన్ రేట్ పడిపోకుండా చూసుకున్నారు. కెప్టెన్ కోహ్లీ ఎంత మంది బౌలర్లను మార్చినా.. వీరిద్దరూ చెలరేగిపోయి ఆడారు. ఈ క్రమంలో డేవిడ్ మలన్ 33 బంతుల్లో అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లోని జాస్ బట్లర్ 30 బంతుల్లో అర్దసెంచరీ చేశాడు. వీరిద్దరినీ ఆపడానికి కోహ్లీకి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మరో సారి భువనేశ్వర్‌కు బంతిని అందించాడు. భువనేశ్వర్ పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి పెంచడంతో జాస్ బట్లర్(52) భారీ షాట్ కోసం యత్నించి హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
రెండో వికెట్ పడిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా బౌలర్లు ఒత్తిడి పెంచడంతో జానీ బెయిర్‌స్టో (7), డేవిడ్ మలన్ (68), ఇయాన్ మోర్గాన్ (1) వరుసగా వికెట్లు పారేసుకున్నారు. బెన్ స్టోక్స్ (14), క్రిస్ జోర్డాన్ (11) కాసేపు పరుగుల కోసం ప్రయత్నించారు. అయితే రన్ రేట్ పెరిగిపోతుండటంతో ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమ్ ఇండియా 5వ టీ20లో 36 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను ఎగరేసుకొని పోయింది. శార్దుల్ ఠాకూర్ 3, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, నటరాజన్ తలా ఒక వికెట్ తీశారు. 2 వికెట్లు తీయడంతో పాటు డాట్ బాల్స్ వేసి ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి తెచ్చిన భువనేశ్వర్ కుమార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది.
దంచి కొట్టిన టీమ్ ఇండియా..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి సారిగా అభిమానులకు పరుగుల సునామీని చూసే అదృష్టం కలిగింది. ఈ కీలకమైన టాస్ ఓడిపోయినప్పటికీ ఇండియా జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఈ సిరీస్‌లో విఫలమవుతూ వస్తున్న కేఎల్ రాహుల్‌ను తప్పించి నటరాజన్‌ను తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. మొదటి బంతి నుంచే రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. బౌలర్ ఎవరైనా సరే బౌండరీలు బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూనే రోహిత్ శర్మకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కేవలం 30 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత బౌండరీలు, సిక్సులు బాదిన రోహిత్ శర్మ(64) బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఇన్‌సైడ్ ఆడి బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్‌కు రోహిత్, కోహ్లీ కలసి 94 పరుగులు జోడించారు. ఇక ఆ తర్వాతైనా ఇండియా దూకుడు తగ్గుతుంది అనుకుంటే.. రోహిత్ తర్వాత వచ్చిన సూర్యకుమార్ తన ఫామ్‌ను కొనసాగించాడు. దూకుడుగా ఆడుతూ సూర్యకుమార్ (32) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జోర్డాన్ అద్భుతంగా బంతిని బౌండరీ వద్ద పట్టి జేసన్ రాయ్‌కు ఇవ్వడంతో అవుటయ్యాడు. మరో ఎండ్‌లో కోహ్లీ ప్రతీ బ్యాట్స్‌మన్‌కు అండగా ఉన్నాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో 28వ అర్దసెంచరీ. ఇక ఆ తర్వాత కోహ్లీకి జత కలసిన హార్దిక్ పాండ్యా మొదట్లో కాస్త తడబడ్డాడు. కానీ ఆ తర్వాత చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. కోహ్లీ 52 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా 2 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు :
ఇండియా ఇన్నింగ్స్
రోహిత్ శర్మ (బి) బెన్ స్టోక్స్ 64, విరాట్ కోహ్లీ 80 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ (సి) జేసన్ రాయ్ (బి) ఆదిల్ రషీద్ 32, హార్దిక్ పాండ్యా 39 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం 224/2
వికెట్ల పతనం : 1-94, 2-143
బౌలింగ్: ఆదిల్ రషీద్ (4-0-31-1), జోఫ్రా ఆర్చర్ (4-0-43-0), మార్క్‌వుడ్ (4-0-53-0), క్రిస్ జోర్డాన్ (4-0-57-0), సామ్ కర్రన్ (1-0-11-0), బెన్ స్టోక్స్ (3-0-26-1)
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్
జేసన్ రాయ్ (బి) భువనేశ్వర్ కుమార్ 0, జాస్ బట్లర్ (సి) హార్దిక్ పాండ్యా (బి) భువనేశ్వర్ కుమార్ 52, డేవిడ్ మలాన్ (బి) శార్దుల్ ఠాకూర్ 68, జానీ బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) శార్దుల్ ఠాకూర్ 7, ఇయాన్ మోర్గాన్ (సి)(సబ్) కేఎల్ రాహుల్ (బి) హార్దిక్ పాండ్యా 1, బెన్ స్టోక్స్ (సి) రిషబ్ పంత్ (బి) నటరాజన్ 14, క్రిస్ జోర్డాన్ (రనౌట్) 1, సామ్ కర్రన్ 14 నాటౌట్, ఆదిల్ రషీద్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లు) 188/8
వికెట్ల పతనం : 1-0, 2-130, 3-140, 4-142, 5-142, 6-165, 7-168, 8-174
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ (4-0-15-2), హార్దిక్ పాండ్యా (4-0-34-1), వాషింగ్టన్ సుందర్ (1-0-13-0), శార్దుల్ ఠాకూర్ (4-0-45-3), నటరాజన్ (4-0-39-1), రాహుల్ చాహర్ (3-0-33-0)
టీమ్ ఇండియా సిరీస్ గెలిచింది ఇలా..
1- 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం
2- 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం
3 – 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం
4 – 8 పరుగుల తేడాతో ఇండియా విజయం
5 – 36 పరుగుల తేడాతో ఇండియా విజయం