అసంపూర్ణ తెలంగాణ

by Prasanna |
అసంపూర్ణ తెలంగాణ
X

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి ఆరేండ్లు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయం నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ ఉద్యమం. అలాంటిది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఆరేండ్లవుతున్నా ఉద్యమ లక్ష్యాలు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్ని అటకెక్కాయి. సంక్షేమంలో ఆదర్శంగా నిలిచినా.. కొన్ని పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. మరికొన్నింటి ఊసే లేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.64 వేల కోట్ల అప్పులుండగా నేడు రూ.3 లక్షల కోట్లకు పెరిగాయి. ధనిక రాష్ట్రం అని డాంబికాలు పలుకుతున్నా కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉంది.

దిశ, న్యూస్ బ్యూరో: నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయం నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర సాధనతో సమాప్తమైంది. కానీ ఆ లక్ష్యాలు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. ఉద్యమ సారథే రాష్ట్ర సారథి అయ్యారని అధికార టీఆర్ఎస్ నాయకులు గర్వంగా చెప్పుకుంటారు. కానీ, ఈ ఆరేండ్ల ప్రస్థానంలో ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయో.. మరెన్ని అడుగులు వెనక్కి పడ్డాయో రాష్ట్రంలోని ప్రజలకు స్వీయానుభవం. ఉద్యమ సమయంలో, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీల్లో కొన్ని అటకెక్కాయి. ‘దళితుడే తొలి ముఖ్యమంత్రి. మాట ఇస్తే పాటిస్తడుగానీ తల నరుక్కున్నా వెనక్కి తగ్గడు. దళితులకు మూడెకరాల భూమి. 2014-19 మధ్యలో వందకు వంద శాతం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీరుతం. ఇంటింటికీ మంచినీరు ఇవ్వకుంటే ఓట్లే అడగం. కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తాం. హోంగార్డుల్ని క్రమబద్ధీకరిస్తాం. హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్లలాగ మారుస్తం. కౌలాలంపూర్‌లోని ‘పెట్రోనాస్’, ముంబయిలోని ‘సీ ఫ్రంట్ టవర్స్’ లాంటి ఆకాశహర్మ్యాలను హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మిస్తం.’… ఇలా పదుల సంఖ్యలో హామీలు ఏమయ్యాయో జగద్విదితం.

కేసీఆర్ ఫామ్‌‌హౌస్ దాకా గోదావరి నీళ్లు

నీళ్ల విషయంలో గోదావరి ద్వారా కేసీఆర్ ఫామ్‌‌హౌస్ వరకు నీరు వచ్చినా కృష్ణా నదిలో మాత్రం కనీసం హక్కుగా లభించిన వాటాను సైతం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతోంది రాష్ట్రం. నిధుల విషయంలో రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.64 వేల కోట్ల అప్పులుంటే ఇప్పుడు అది రూ.3 లక్షల కోట్లకు చేరింది. రెండు నెలలు లాక్‌డౌన్‌తో వ్యాపార లావాదేవీలు ఆగిపోతే కనీసం ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిని చూస్తున్నాం. ధనిక రాష్ట్రం, అత్యధిక ఆర్థిక వృద్ధి సాధిస్తున్న రాష్ట్రం ఇప్పుడు రోజువారీ అవసరాలకు తంటాలు పడుతోంది. నియామకాల విషయంలో అమరుల కుటుంబాలన్నింటికీ ఉద్యోగం, లక్ష ఉద్యోగాల భర్తీ ఎక్కడిదాకా వచ్చిందో అధికార, విపక్ష సభ్యుల మధ్య అసెంబ్లీలో జరుగుతున్న చర్చలే నిదర్శనం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 36,643 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే భర్తీ అయింది 29 వేల ఉద్యోగాలు. ఇక పోలీసు, విద్యుత్, సింగరేణి తదితర శాఖల్లో మరికొన్ని ఉద్యోగాల భర్తీ జరిగింది.

సంక్షేమంలో వినూత్నం

ఓట్లు కురిపించే సంక్షేమ పథకాల అమలులో కొన్నింటిలో రాష్ట్రం ఒక అడుగు ముందే ఉంది. కొన్ని పథకాలు మధ్యలోనే ఆగిపోగా, మరికొన్ని పాక్షికంగా అమలవుతున్నాయి. దళితులకు మూడెకరాల భూమి చొప్పున మొత్తం మూడు లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, జనవరి 2020 నాటికి ఐదున్నర వేల మందికి మాత్రమే 16,127 ఎకరాలను పంపిణీ చేశారు. వృద్ధాప్య పింఛను లబ్ధిదారుల వయసును 57 ఏళ్లకు కుదిస్తామని రెండేళ్ళవుతున్నా కనీసం కాగితాల్లోకి కూడా రాలేదు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3,016 చొప్పున భృతి ఇస్తామన్నా దాని ఊసే లేదు. ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన కులాలకు సంక్షేమ భవన్‌లు కట్టిస్తామని చెప్పి ఒకదానికి భూమిపూజ జరిగినా ఒక్కటీ ఇప్పటికి పూర్తికాలేదు. ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసలు కురిపించిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతుబంధు పథకం అప్రకటితంగా పాక్షికంగా అమలవుతోంది. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ అమలు గురించి చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్రంలో అక్కడక్కడా మంచినీళ్ల కోసం రోడ్డు మీద ధర్నాలు చేస్తుండడమే నిలువెత్తు ఉదాహరణ. అగ్గిపెట్టెల్లాంటి ఇందిరమ్మ ఇళ్ళకు బదులుగా రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం పదివేల గృహాలను కూడా లబ్ధిదారులకు అందించ లేకపోయింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛను, మహిళా బీడీ కార్మికులకు పింఛను లాంటి పథకాలు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. ఎన్నికల ప్రణాళికలో చెప్పకున్నా 76 పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ అసెంబ్లీలోనూ, 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ చెప్పుకొచ్చారు. ప్రణాళికలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేశామన్నారు. కానీ, పైన ప్రస్తావించిన వాటి అమలు ఏ స్థాయిలో ఉందో పరిశీలిస్తే కేసీఆర్ మాటల్లోని నిజమెంతో తెలిసిపోతుంది. గడిచిన ఆరేళ్ల కాలంలో పోలీసు సంస్కరణలు, యూనిఫారం మార్పు, హోంగార్డులను క్రమబద్ధీకరించడం, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడం.. ఇవన్నీ కాగితాలకే పరిమితమై పోయాయి. ఔట్ సోర్సింగ్ విధానాన్ని 2017 మార్చి 11న అసెంబ్లీ వేదికగా తప్పుపట్టిన కేసీఆర్ ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.

కొలువుల భర్తీ

ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటుందని పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్పష్టం చేశారు. ఆ ప్రకారం 43% ఫిట్‌మెంట్ ఇచ్చారు. 2018 జూలై నుంచి ఉద్యోగులకు రావాల్సిన కొత్త పీఆర్సీ అతీగతి లేదు. ఐఆర్ సంగతి అటే పోయింది. ఖాళీ పోస్టుల భర్తీ అంతంత మాత్రంగానే ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త ఉద్యోగాలు వస్తాయని, ప్రతి జిల్లాకు ఒక ‘నిమ్స్’ తరహా ఆసుపత్రి వస్తుందని, 13 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. 2017-18 నాటికే యాభై వేల ఉద్యోగాల భర్తీకి నిధుల్ని బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనలు, ఆచరణ పట్ల ఉద్యోగ సంఘాలకే సంతృప్తి లేదు. కరోనా కారణంగా నెల జీతాల్లో కోత పెట్టడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాల్సి వచ్చింది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ధర్నాల అవసరం ఉందా? అని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక నిర్వహణ అయోమయం

ఆర్థికాభివృద్ధిలో దేశంలోని మరే రాష్ట్రం కంటే తెలంగాణ భేషుగ్గా ఉందని కేసీఆర్ పలు సందర్భాల్లో ఒకింత గర్వంగానే చెప్పుకున్నారు. 17.7% ఆర్థిక వృద్ధి రేటుతో ధనిక రాష్ట్రంగా ఉందని చెప్పారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలో చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు రూ.64 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. అప్పులు పెరగడంపై విపక్షాలు చర్చ లేవనెత్తితే రాష్ట్ర సంపదను వృద్ధిచేసే కాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. చివరికి ఈ అప్పులను తిరిగి చెల్లించడానికి, వడ్డీలు చెల్లించడానికి ఏటా రూ.37 వేల కోట్లను కేటాయించాల్సి వస్తోంది. ఏటా మిగులు బడ్జెట్‌తో ధనికరాష్ట్రంగా ఉన్న తెలంగాణ కరోనా కారణంగా రెండు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్థంభించిపోతే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని చిక్కు పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story