ఆరు నెలల క్రితమే ప్లాన్..!

by srinivas |
ఆరు నెలల క్రితమే ప్లాన్..!
X

దిశ, క్రైమ్ బ్యూరో: హఫీజ్ పేట భూ వివాదం నేపథ్యంలో జరిగిన కిడ్నాప్ కేసులో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ రిమాండ్‌లో ఉండగా, మిగతా నిందితులలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్‌తో పాటు మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పలు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూనే వారి నేర చరిత్రను వెలికితీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ కేసులో అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ ఎంత కీలకంగా వ్యవహారించారో.. భార్గవ్ రామ్‌కు ప్రధాన అనుచరుడుగా ఉండే గుంటూరు శ్రీను పాత్ర కూడా అంతే కీలకంగా ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నట్టు సమాచారం. కిడ్నాప్ ప్లాన్ అంతా అతని కనుసన్నల్లోనే జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఐటీ అధికారులుగా వ్యవహారించేందుకు శ్రీనగర్ కాలనీలోని డ్రెస్ లను అద్దెకు తీసుకుని కిడ్నాప్ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది.

నెంబరు ప్లేట్ తో పట్టుబడి..

ఈ కేసులో కీలకంగా వ్యవహారించిన గుంటూరు శ్రీను నకిలీ నెంబరు ప్లేట్ కలిగిన వాహనంతో తిరుగుతుండగా.. 5 నెలల క్రితమే బోయిన్‌పల్లి పోలీసులు దొరికినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ కిడ్నాప్ ను గత 5-6 నెలల క్రితమే ప్లాన్ చేసినట్టుగా భావించాల్సి వస్తోంది. అయితే, నకిలీ నెంబరు ప్లేట్ వాహనంతో పట్టుబడిన సమయంలో తాను కొందరి ముఖ్యమైన వ్యక్తుల కోసం పనిచేస్తున్నానని, అందుకే తరుచూ నెంబరు ప్లేట్ మార్చాల్సి వస్తోందంటూ పోలీసులకు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే ప్రవీణ్ రావు ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్‌తో పాటు మిగతా నిందితుల నేర చరిత్రపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. అఖిల ప్రియ మాజీ మంత్రి కావడంతో వారి కుటుంబానికి పెద్ద ఎత్తున రాజకీయ ప్రాబల్యం కలిగి ఉన్నందున.. అవేమీ ఈ కేసుపై ప్రభావితం కాకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కోర్టులో అఖిల్ ప్రియ బెయిల్ పిటీషన్ ను అపోజ్ చేస్తూ.. మరో వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed