పులిచింతల ప్రాజెక్ట్: గేటు బిగించాలంటే ఆ పని చేయాల్సిందే.. తేల్చి చెప్పిన అధికారులు

by Anukaran |   ( Updated:2021-08-05 06:21:11.0  )
పులిచింతల ప్రాజెక్ట్: గేటు బిగించాలంటే ఆ పని చేయాల్సిందే.. తేల్చి చెప్పిన అధికారులు
X

దిశ, హుజూర్ నగర్: ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులోని వరద నీటిని క్రిందకు వదులుతున్న క్రమంలో వరద ప్రవాహానికి 16 వ నెంబర్ గేటు కొట్టుకోపోయింది. గురువారం తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. అధిక మొత్తంలో డ్యామ్ నుండి నీరు క్రిందకు వెళ్తుండటంతో ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీ గేట్ బిగించడానికి డ్యామ్ అధికారులు సన్నాహాలు చేపట్టారు. డ్యామ్ స్టోరేజీ నుండి పెద్ద మొత్తంలో నీటిని డిశార్జ్ చేస్తే తప్పా.. గేట్ బిగించే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ప్రాజెక్టుకు ఎగువనుండి 1,76,414 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. దిగువకు ఓపెన్ చేసిన 17 గేట్ల నుండి 4,85,606 క్యూసెక్కుల నీరు డిశార్జ్ అవుతుంది. కాగా గురువారం ఉదయం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా స్టాప్ లాక్ గేట్ ను యధాస్థితిలో ఉంచాలంటే రిజర్వాయర్ నీటి స్థాయిని తగ్గించాలని, అందుకు ప్రాజెక్ట్ నుండి సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని ఏ సమయంలో అయినా క్రిందకు డిశార్జ్ చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ కు దిగువన ఉన్న వారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story