నేను తప్పు చేస్తే దేనికైనా రెడీ : మంత్రి అనిల్ సంచలన కామెంట్స్

by srinivas |   ( Updated:2021-07-05 07:48:34.0  )
Minister-Anil-Kumar
X

దిశ, ఏపీ బ్యూరో : నెల్లూరు నియోజకవర్గంలో తాను చేసే అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. తాను తప్పు చేస్తే ధైర్యంగా ప్రజల మధ్యలో ఒప్పుకుంటానన్నారు. నెల్లూరు నగరంలోని 15వ డివిజన్‌లో సోమవారం ఆయన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో అర్హత కలిగిన ప్రతీ పేదవాడికి తొమ్మిది అంకణాల స్థలం ఇస్తానని గతంలో తాను హామీ ఇచ్చినట్లు అంగీకరించారు.

అయితే, భూమి అందుబాటులో లేకపోవడం వల్ల 6 అంకణాలు మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో 6 అంకణాల చొప్పున మొత్తం 14 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటే 350 ఎకరాల భూమి కావాలన్నారు. ఇప్పటికే ఇనమడుగు వరకు భూములను కొనుగోలు చేశామన్నారు. అదే 9 అంకణాలు చొప్పున ఇవ్వాలి అంటే సుమారు 450 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు అవసరం అవుతుందన్నారు. అంత భూమి జిల్లా చుట్టుపక్కల అందుబాటులో లేదని మంత్రి అనిల్ తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తప్ప మాట తప్పనన్నారు.

జగనన్న కాలనీ ఇళ్లలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. పేదలకు ఇచ్చే 6 అంకణాలు మరో 5 ఏళ్లలో.. అంకణం లక్ష రూపాయలు చొప్పున రూ.6 లక్షల విలువ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఇది భవిష్యత్తులో పేదవాడికి ఆస్తిగా ఉపయోగపడుతుందన్నారు. టిడ్కో గృహాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు విమర్శలు తప్ప అభివృద్ధి పట్టదని తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, వైసీపీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, గణేశం కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Next Story