ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్.. అత్యవసర ప్రణాళికపై చర్చ

by Shyam |
ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్.. అత్యవసర ప్రణాళికపై చర్చ
X

కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ క్రీడా క్యాలెండర్ (ఎఫ్‌టీపీ- ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం) మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఐసీసీ నిర్వహించబోయే టీ20 వరల్డ్ కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లపై దీని ప్రభావం పడనుంది. దీంతో అత్యవసర ప్రణాళిక సిద్ధం చేయాలని ఐసీసీ భావిస్తోంది. ఇందు కోసం శుక్రవారం అన్ని క్రికెట్ బోర్డుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రతినిధిగా అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్ గురించి చర్చ జరిగింది.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంకా ఏం చర్చకు వచ్చాయనే విషయాలను ఐసీసీ సీఈవో మను సాహ్ని వివరించారు.

ఐసీసీ ఈవెంట్స్ టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల నిర్వహణపై సలహాలు, సూచనలు అడిగారని.. పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది కాబట్టి.. ఆ మ్యాచ్‌లు రద్దయితే పాయింట్లు ఎలా పంచుతారని సాహ్నిని ప్రశ్నించగా.. అదే జరిగితే ఈ విషయాన్ని సాంకేతిక కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతానికైతే సాంకేతిక కమిటీనే దీనికి పరిష్కారం చూపగలదు, అయితే అన్ని బోర్డులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే తీసుకుంటామని’ అన్నారు. ఇండియా ఆరు సిరీస్‌లు ఆడి అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ మూడు సిరీస్‌లు మాత్రమే ఆడిందని అన్నారు. కరోనా ఉధృతి చూస్తుంటే జులై వరకు దాని ప్రభావం కాస్త తగ్గేలా ఉందని, అప్పటికీ తగ్గకుంటే ఐసీసీ అత్యవసర ప్రణాళిక అమలు చేస్తుందని సాహ్ని స్పష్టం చేశారు.

Tags: ICC, Video conference, BCCI, Test chmpionship, CEO Manu sahni

Advertisement

Next Story

Most Viewed