అంబేద్కర్ ఆశయాల సాధనకే నేను అంకితం..

by Shyam |
అంబేద్కర్ ఆశయాల సాధనకే నేను అంకితం..
X

దిశ, మహబూబ్ నగర్: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్ బి .ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు .అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజ్యాంగంలో పొందుపరచాడని. దీని మేరకే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన తెలిపారు.

తెలంగాణ రాక ముందు తాగునీరు, విద్యుత్ వంటి అనేక సమస్యలు ఉండేవని, తినేందుకు తిండి కూడా లేక వలస వెళ్లే వారని,ఇప్పుడు వాటన్నిటినీ అధిగమించి ఏడు సంవత్సరాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బడుగు, బలహీన వర్గాల వారికోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ముఖ్యంగా దళితులకు దళిత బంధు ప్రవేశపెట్టామని, నూటికి నూరు శాతం దళిత బంధు అమలు చేసి తీరుతామని ఆయన వెల్లడించారు .
సమాజంలో అసమానతల నిర్మూలనకు భారత రాజ్యాంగంలో డా.బి.ఆర్ అంబేద్కర్ రచించినప్పటికీ ఇంకా అక్కడక్కడ అసమానతలు కొనసాగడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీసులను ఆయన ఆదేశించారు . పేద వర్గాలకు తగినంత న్యాయం చేసేందుకు దళిత బంధుతో పాటు, అన్ని రంగాల్లో వారు ఆర్థికంగా బలపడేందుకు రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా వారి అభ్యున్నతికి ,ఆ జాతి అభివృద్ధి కి అంకితం అవుతామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట రావు, ఎస్ పీ ఆర్. వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మెన్ కే.సీ. నరసింహులు, డీ సీ సీబీ ఉపాధ్యక్షులు వెంకటయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, అధికారులు యాదయ్య, ఇందిరా చత్రు, ఆర్డీఓ పద్మశ్రీ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇతర అధికారులు ,తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed