బారికేడ్లు.. ముళ్ళ కంచెలు!

by Shyam |   ( Updated:2020-03-24 05:12:24.0  )
బారికేడ్లు.. ముళ్ళ కంచెలు!
X

దిశ, హైదరాబాద్:
కరోనా వైరస్ ప్రభావంతో కొన్నిరోజులుగా యావత్తు జన జీవనం స్థంభించిపోయింది. ఈ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కన్పించడం లేదు. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఈ వైరస్ వ్యాప్తిని ఎలాగైనా సరే, కట్టడి చేయాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అత్యధికంగా బాధితులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడంతో స్థానికంగా ఉన్నవారికి ఈ వైరస్ విస్తరించకుండా ఉండేందుకు ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం జనతా కర్ఫ్యూను విధించాయి. ఈ జనతా కర్ఫ్యూ నూటికి నూరు శాతం విజయవంతం కావడంతో అటు కేంద్రం ప్రభుత్వంలోనూ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ కరోనాను అరికట్టవచ్చనే నమ్మకం ఏర్పడింది. జనతా కర్ఫ్యూకు కొనసాగింపుగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించగా, ప్రభుత్వాలు ఆశించినట్టు కాకుండా ప్రజలు సాధారణ రోజులను తలపించారు. ఇలా అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడం అంత సులువైన విషయం కాదని గమనించిన పోలీసులు కఠిన నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు..

జనతాకర్ఫ్యూ అనంతరం 23 నుంచి ఈ నెల 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా, హైదరాబాద్ నగరంతో సహా జిల్లాల ప్రజల సైతం అత్యధిక శాతం రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు, ఒక్కో బైక్‌పై ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పినా పలుచోట్ల ఒక్కో బైక్ పై డబుల్, త్రిబుల్ రైడింగ్ చేస్తూ కన్పించారు. సాధారణ రోజుల మాదిరిగానే రోడ్లపై ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. ఈ పరిస్థితుల్లో డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు రంగం ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆయా కూడళ్ళ వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేసిన పోలీసులు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు. ఇటలీ, స్పెయిన్ దేశాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని హితబోధ చేశారు. ఇక నుంచి బైక్ లపై ఇద్దరు, ముగ్గురు కన్పిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బారికేడ్లు.. ముళ్ల కంచెలు..

పోలీసుల రంగం ప్రవేశంతో ఒక్కసారిగా సీన్ మారింది. నగరంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన ఫ్లై ఓవర్లను మూసివేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి సచివాలయం వైపు వెళ్ళే ఫ్లై ఓవర్, సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ (తెలుగు తల్లి) ఫ్లై ఓవర్లను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ఇందిరాపార్కు రోడ్డును పూర్తిస్థాయిలో బంద్ చేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం వేళలో మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. మిగతా సమయాలలో చాలాతక్కువ వాహనాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో ఒక్కసారిగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. వాహనదారులను ఆపి మరీ.. ఎక్కడకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో వాహనదారులను వివరాలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దంటూ పదే పదే చెబుతున్నారు. సరైన సమాధానం చెప్పని వారి బండ్లను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

Tags: police, corona virus, hyderabad roads, vehicles, janatha curfew

Advertisement

Next Story