సామాజిక సమస్యలపై హైదరాబాదీ ఆర్టిస్టుల చిత్రాలు

by Shyam |
సామాజిక సమస్యలపై హైదరాబాదీ ఆర్టిస్టుల చిత్రాలు
X

దిశ, ఫీచర్స్ : మనసును హత్తుకునే ప్రతీ కళ వెనుక, దాన్ని ప్రదర్శించే కళాకారుల ప్రతిభ దాగి ఉంటుంది. కళాక‌ృతులను జనరంజకంగా రూపొందించడమే కాక, వాటి ద్వారా సామాజిక సమస్యలపై ఆలోచన రేకెత్తించడంలోనూ తమ ప్రత్యేకత చూపిస్తుంటారు. ఇదే కోవలో హైదరాబాద్‌ మహానగరానికి చెందిన ఇద్దరు ఆర్టిస్టులు.. పుష్కర కాలంగా స్ట్రీట్ ఆర్ట్ ద్వారా పలు సమస్యలపై తమ ఆలోచనల్ని వ్యక్తపరుస్తున్నారు.

స్వాతి, విజయ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50 వరకు వాల్ పెయింటింగ్స్ వేశారు. తాజాగా వీరు వేసిన కొన్ని చిత్రాలు వరంగల్‌లోని రీజనల్ లైబ్రరీలో పెయింటింగ్స్ రూపంలో ఉన్నాయి. గత 12 ఏళ్లుగా తమ ఆలోచనలు వ్యక్తపరిచేందుకు వాల్ పెయింటింగ్స్‌ను ప్లాట్‌ఫామ్‌గా ఎన్నుకున్న ఈ ఆర్టిస్టులు.. ఏపీ, తెలంగాణతో పాటు ఒడిషా, తమిళనాడు, రాజస్థాన్‌తో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోనూ స్ట్రీట్ ఆర్ట్స్ వేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, హ్యుమానిటీ, టెక్నాలజీ తదితర సమస్యలపైనే ఎక్కువ పెయింటింగ్స్ రూపొందించారు. కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఉద్యమస్ఫూర్తిపై వేసిన మొదటి పెయింటింగ్‌తో తమ జర్నీ స్టార్ట్ అయిందని ఆర్టిస్టుల్లో ఒకరైన విజయ్ తెలిపాడు.

‘వీధి కళ అనేది ప్రజలకు సందేశం ఇవ్వడమే కాదు, ప్రజల్లో అనేక సమస్యలపై ఆలోచనను రేకెత్తించే సాధనం అని నా నమ్మకం. అందుకే ఈ ఆర్ట్‌ ద్వారా మా ఆలోచనలను సమాజానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని స్వాతి వెల్లడించింది. కాగా ‘మొదట్లో మేము వేసిన చిత్రాలను ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించాలనుకున్నాం. కానీ ఒక కళాకృతిని గ్యాలరీలోకి తీసుకెళ్లాలంటే దానికి సుందరీకరణ అవసరమని అర్థమైంది. అది కంఫర్టబుల్‌గా అనిపించలేదు’ అని విజయ్ చెప్పాడు. భారత్‌లో వీధి కళలకు ఆదరణ పెరుగుతోందని అన్నారు.

Advertisement

Next Story