- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ ముందు పెను సవాల్.. ట్రయాంగల్ ఫైట్ @ హుజురాబాద్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూతన పీసీసీ చీఫ్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2018 అసెంబ్లీ వరకు కాంగ్రెస్వర్సెస్టీఆర్ఎస్గా ఉన్న రాజకీయాలు.. దుబ్బాక ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయి. అప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమవుతూ వస్తోంది. గ్రేటర్‌లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ పార్టీ టీడీపీలాగే తెలంగాణలో కనుమరుగవుతుందనే అంచనాకు వచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు కూడా అలాగే నెలకొన్నాయి. కానీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడంతో రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం ఎదురుదాడే ఆయుధంగా మార్చుకునే రేవంత్ హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహన్ని ఎంచుకోనున్నాడనేది ఇప్పుడు రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే హుజురాబాద్‌లో చేసే ఫైట్.. వచ్చే ఎన్నికలకు నాంది అవుతుందంటున్నారు.
పోరు మారింది
మొన్నటివరకు హుజురాబాద్ ఉప ఎన్నికలకు రెండు పార్టీల మధ్య పోటీ అనే పరిస్థితి నెలకొంది. అటు కాంగ్రెస్ కూడా చేతులెత్తేసినట్లే చేస్తోంది. కాంగ్రెస్ నేతలు… టీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉండటంతో అక్కడ పోటీ టీఆర్‌ఎస్, బీజేపీ అన్నట్టుగానే సాగింది. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానుందని భావిస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయాల్లో చర్చ మొదలైంది. మాస్, క్లాస్ యూత్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సారథికి హుజురాబాద్ ఉప ఎన్నికల ఓ సవాల్‌గా మారనున్నాయి.
ఓటు బ్యాంకు పదిలమేనా..?
హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌దే పై చేయిగా నిలుస్తూ వస్తోంది. అక్కడ ఈటల రాజేందర్ వరుసగా గెలుస్తున్నారు. ప్రస్తుతం ఈటల బీజేపీలో చేరికతో పరిస్థితి మారింది. వాస్తవంగా ఇక్కడ బీజేపీకి కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు కూడా ఉండటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన పుప్పాల రఘుకు 1683 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌కు 1.04 లక్షలు పోలవగా… కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డికి 61,121 ఓట్లు వచ్చాయి. అక్కడ రెండోస్థానంలో కాంగ్రెస్ నిలిచింది.
అయితే ప్రస్తుతం సీన్ మారింది. బీజేపీ నుంచి ఈటల పోటీ చేస్తుండగా… టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఈ పరిస్థితుల్లో గతంలో వచ్చిన ఓట్లను కచ్చితంగా సాధించుకుని తిరిగి రెండో స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు చేయాల్సి ఉంటోంది. మరోవైపు హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి నిర్ణయం మీద పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు లేకపోలేదని చర్చమొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో రెండు పర్యాయాలు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాకుండా కౌశిక్‌రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు కావడంతోనే గతంలో రెండు సార్లు ఓడిపోయినా టిక్కెట్ ఇచ్చారు. మరోవైపు కౌశిక్ ఇటీవల టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా మెలగడం వంటి అభియోగాలు ఉన్నాయి. దీంతో కచ్చితంగా హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కొత్త పేరును అధిష్టానం పరిశీలిస్తుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు రెండు రోజుల కిందట వరకు హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ అని అనుకున్నారు. కానీ రేవంత్‌కు పీసీసీ పగ్గాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ చర్చల మొదలైంది. అయితే ఇది ఎవరికి లభిస్తుందనేది పక్కన పెడితే… ఏ మేరకు ఓట్లను చీల్చి తమ పట్టును నిలుపుకుంటుందో అనే చర్చ కూడా ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్‌లో అనుసరించే వ్యుహాన్ని బట్టి పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందనే సంకేతాలు కూడా వెళ్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన పదవులలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మొండి చేయి చూపించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. పీసీసీ రేసులో జీవన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఉమ్మడి జిల్లాల్లో పార్టీ సీనియర్లు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, నెరేళ్ల శారద వంటి నేతలకు పదవి దక్కకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రభావం కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక మీద పడే అవకాశం ఉందంటున్నారు. వీరందరిని రేవంత్ తన దారిలోకి తెచ్చుకుంటేనే జిల్లాలో తిరిగి పట్టు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటివరకు హుజురాబాద్‌లో బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరి యుద్ధం చేస్తున్నా… కాంగ్రెస్ పార్టీ నేతలు మౌనంగా ఉంటున్నారు. కనీసం అటువైపు కూడా చూడని పరిస్థితి నెలకొంది. అయితే పార్టీ కొత్త సారథి రేవంత్ ఏ మేరకు అక్కడ బలం నిరూపించుకుంటారో ఇప్పుడు తేల్చుకోవాల్సిన అంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడి ఫలితాలు కాంగ్రెస్‌పార్టీకి జీవం పోసే అవకాశాలు కూడా ఉన్నాయి.