- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ నగారా మోగేదెప్పుడు..?
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. షెడ్యూలు ఎప్పుడొస్తుందో తెలియని అయోమయానికి గురవుతున్నాయి పార్టీలు. తొందరగా జరిగితే బాగుంటుందని, తాజా పరిస్థితి అనుకూలంగా ఉంటుందని బీజేపీ అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్న ఈటల రాజేందర్, ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఆలస్యం జరిగితే గ్రౌండ్‌లో పరిస్థితిని అనుకూలంగా మల్చుకోడానికి వీలవుతుందని టీఆర్ఎస్ అనుకుంటున్నది. ఎప్పుడు ఎన్నిక జరిగినా.. అక్కడ థర్డ్ ప్లేసే గదా అనే ధోరణిలో కాంగ్రెస్ ఉన్నది. ఈ నెల చివరికల్లా షెడ్యూలు రావచ్చని, ఆగస్టు చివరన లేక సెప్టెంబరు మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తికావచ్చని బీజేపీ ఆశలు పెట్టుకున్నది.
అక్టోబరులో రావచ్చని టీఆర్ఎస్ అనుకుంటున్నది. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాత్రం తాజా అప్‌డేట్ తెలుసుకోడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ స్థానం ఖాళీ కావడంతో దాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక షెడ్యూలును ప్రకటించినందున హుజూరాబాద్‌కు కూడా త్వరలో రావచ్చన్న ఆశలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలస్యం కావచ్చని ఊహాగానాలు
కరోనా థర్డ్ వేవ్ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతివారం ఏదో ఒక రకమైన అప్‌డేట్‌ను నీతి ఆయోగ్, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ వెల్లడిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో? లేవో? కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నది. ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులను కూడా పరిశీలిస్తున్నది. అవసరమైనప్పుడు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారుల నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నది. హుజూరాబాద్‌కు డిసెంబరు వరకూ గడువు ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లోని పన్నెండు స్థానాలకు మాత్రం ఆగస్టు చివరికల్లా ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నది. కానీ పరిస్థితులు అనుకూలంగా మారేంత వరకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది.
కరోనా సాకుతో ఆలస్యం చేసే యత్నం
ఇప్పటికిప్పుడు హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహిస్తే పరిస్థితి ఆశాజనకంగా ఉండదన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ ఉంది. వీలైనంత ఎక్కువ కాలం సాగదీయడం ద్వారా అనుకూలంగా మల్చుకోవచ్చని భావిస్తున్నది. ఇందుకోసం హుజూరాబాద్‌లో కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో లెక్కల ఆధారంగా కరీంనగర్ జిల్లా వైద్యారోగ్య శాఖ విశ్లేషణా నివేదికను రూపొందిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నది కరీంనగర్ జిల్లాలోనే. హైదరాబాద్‌లో వారం రోజులుగా తగ్గుతూ ఉంటే కరీంనగర్ జిల్లాలో మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలోని చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకున్నారు ఆ గ్రామ ప్రజలు. ఇలాంటి పరిస్థితులను ఉదహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సైతం రెండు రోజుల క్రితం రాజకీయ సభల ద్వారా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని, అన్ని పార్టీల నేతలు గమనంలో ఉంచుకుని కొవిడ్ నిబంధనలను పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం మాత్రం ఈవీఎంలు, పోలింగ్ బూత్‌ల సంఖ్య, ఎంత మంది పోలింగ్ సిబ్బంది అవసరమవుతారు తదితరాలపై లెక్కలు వేసుకుని నివేదికను సిద్ధంగా ఉంచుకున్నది. షెడ్యూలు ఎప్పుడు ప్రకటించినా రంగంలోకి దిగడానికి సన్నద్ధమవుతున్నది. ఉప ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ టీఆర్ఎస్ నేతలు ఇకపైన స్వరం వినిపించే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి ఎత్తుకు పై ఎత్తుల నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందనేది అంతుచిక్కడంలేదు. తొందర పెడితే టీఆర్ఎస్‌కు చిక్కులు.. ఆలస్యంగా పెడితే ఈటల రాజేందర్‌కు ఇబ్బంది.. అప్పటివరకు ఇదే ఉధృతిని ఎలా కొనసాగించాలనే ఆందోళన ఆయన అనుచరులను వెంటాడుతున్నది. ఇప్పుడు అందరి చూపూ కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఉన్నది.