జీహెచ్ఎంసీ పరిధిలో మాగ్జిమం కేసులు.. రెండు శాతం వ్యాక్సిన్ వృథా

by Shyam |
జీహెచ్ఎంసీ పరిధిలో మాగ్జిమం కేసులు.. రెండు శాతం వ్యాక్సిన్ వృథా
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 684 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంత భారీ సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. గత పదిరోజులుగా జీహెచ్ఎంసీతో పాటు పలు జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల్లో సింహభాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తాజాగా నమోదైన 684 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 184 ఉన్నాయి. దీన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో 45, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61 చొప్పున ఉన్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో 48, మహబూబ్‌నగర్‌లో 23, కరీంనగర్‌లో 23, నల్లగొండలో 24 చొప్పున ఉన్నాయి.

మార్చి నెల 1వ తేదీన రాష్ట్రం మొత్తం మీద కేవలం116 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైతే ఇప్పుడు అది ఆరు రెట్లు పెరిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 26 కేసులు మాత్రమే ఉంటే ఇప్పుడు 164కు చేరుకుంది. మార్చి15వ తేదీన సైతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 204, హైదరాబాద్‌లో 37 చొప్పున మాత్రమే ఉన్నాయి. రెండు వారాల వ్యవధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో రెండు వారాల క్రితం కూడా కేవలం సింగిల్ డిజిట్‌లో మాత్రమే పాజిటివ్ కేసులు ఉన్నాయి. ప్రతీరోజు కరోనా కారణంగా ఇద్దరు, ముగ్గురు చొప్పున చనిపోతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దాదాపు ఐదు వేలకు చేరువగా ఉంది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌లు ఫుల్..

కరోనా కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోకంటే కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రుల్లోని బెడ్‌లే ఎక్కువగా నిండిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్‌లు దాదాపుగా నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఇప్పటికీ చాలా ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అన్ని ప్రైవేటు ఆసుపత్రులకూ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించింది. ఫ్లూ లాంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి, వివిధ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉన్నవారికి కరోనా లక్షణాలు లేకున్నా కూడా పరీక్షలు చేయాల్సిందిగా స్పష్టం చేసింది. వివిధ రకాల సర్జరీల (లేప్రోస్కోపిక్ సహా) కోసం ఆసుపత్రులకు వస్తున్నవారికి, ప్రసవం కోసం చేరుతున్న మహిళలకు కూడా విధిగా పరీక్షలు చేయాలని, అయితే వారం రోజుల్లో ఒకసారికంటే ఎక్కువసార్లు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అన్ని ప్రైవేటు ఆసుపత్రులు విధిగా ప్రతీరోజు ఔట్‌పేషెంట్‌గా, ఇన్‌పేషెంట్లుగా వస్తున్నవారికి ఎంత మందికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేశారో, అందులో వచ్చిన పాజిటివ్ లేదా నెగెటివ్ ఫలితాలను ఐడీ నెంబర్ల వారీగా ప్రజారోగ్య శాఖకు పంపాలని డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖలోని ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

రెండు శాతం వ్యాక్సిన్ వృథా..

తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 12.30 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు తీసుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రానికి అందిన వ్యాక్సిన్ డోసుల్లో 12.55 డోసులను వినియోగించగా, ఇందులో సుమారు రెండు శాతం వృథా అయినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంతకాలం వ్యాక్సిన్ వృథా శాతం కేవలం 0.76% మాత్రమే ఉంటే ఇప్పుడు అది 2.01% కి పెరిగింది. మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 9.93 లక్షల మంది మొదటి డోస్ తీసుకోగా మిగిలిన 2.36 లక్షల మంది సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎక్కవ సంఖ్యలో (3.88 లక్షలు) హెల్త్ కేర్ వర్కర్లు. ఆ తర్వాతి స్థానంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు 1.78 లక్షల మంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed