భారీగా పంట నష్టం.. రూ.10 వేల కోట్ల పరిహారం విడుదల

by Shamantha N |   ( Updated:2021-10-13 07:23:02.0  )
Huge crop damage
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన పంటలన్నీ నీట మునగగా.. రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే, రైతుల గోడును పట్టించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో బాధపడుతున్న రైతుల కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, అశోక్ చౌహ్వా్న్‌లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ప్యాకేజీని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సమావేశం అనంతరం సీఎం ఠాక్రే మాట్లాడుతూ.. రాష్ట్రంలో జూన్ నుంచి అక్టోబర్ వరకూ భారీగా కురిసిన వర్షాలకు 55 లక్షల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ.10వేలు, ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.15వేలు, శాశ్వత పంటలకు హెక్టారుకు రూ.25వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ నష్టాల్లో ఉన్న తమకు కొంత ఉపశమనం కలుగుతుందంటూ రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed